– అందుకే ఆ శాఖను నావద్ద ఉంచుకున్నా
– ఉద్యమంలో ప్రతీ పల్లెకు ‘జై తెలంగాణ’ చేరవేశారు
– మీ సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగి ఉండొచ్చు
– అందరం కలిసి తెలంగాణను పునర్నిద్దాం
– గురుపూజోత్సవ కార్యక్రమంలో టీచర్లకు సీఎం పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: విద్యా శాఖ నావద్దే ఉండడంతో దాన్ని ఎవరికైనా ఇవ్వాలని మిత్రులు కొందరు అంటున్నారు..విద్యా శాఖ నా వద్ద ఉంటే అది బాగుపడుతుందనో లేక పేద పిల్లలు బాగుపడతారనో ఏమో కొందరు విమర్శలు చేస్తున్నారు.. కానీ నేను ఒక్కటే చెప్పదలచుకున్నా.. విద్యా శాఖలో సమస్యలు అర్థం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా.. అందుకే ఆ శాఖను నా వద్దే ఉంచుకున్నా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గురుపూజోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రులు చాలామంది రెవెన్యూ, ఆర్ధిక శాఖ, నీటిపారుదల శాఖలను వారి దగ్గర పెట్టుకుంటారు.. కానీ నేను మీ సోదరుడిగా విద్య శాఖను ఉంచుకుని స్వయంగా పర్యవేక్షిస్తున్నా.. పదేళ్లలో విద్యా శాఖ అస్తవ్యస్తమైంది.. కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామని చెప్పారు గత పాలకులు.. మరి అది అమలు జరిగిందా అనేది మీరే ఆలోచించుకోవాలి అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతీ పల్లెకు జై తెలంగాణ నినాదాన్ని చేరవేసింది ఉపాధ్యాయులేనని, ఆనాడు బడికి వచ్చే పిల్లల్నే కాదు తల్లిదండ్రులను కూడా ప్రభావితం చేసి ఉద్యమం వైపు నడిపించారు అని చెప్పారు. పదేళ్లుగా టీచర్ల బదిలీలు జరగలేదు.. 2017 నుంచి టీచర్ల నియామకాలు జరగలేదు.. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేవలం 55 రోజుల్లో 11 వేల టీచర్ల నియామకాలు పూర్తి చేశామన్నారు. డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంచాలన్న ఆలోచన ఆనాటి పాలకులకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. విద్యను లాభసాటి వ్యాపారంగా మార్చుకుని ఆధిపత్యం చెలాయించాలని వారు ప్రయత్నించారని విమర్శించారు. ప్రొఫెసర్లను నియమించకుండా యూనివర్శిటీలను నిర్వీర్యం చేశారు.. ఉస్మానియా, కాకతీయ వైభవాన్ని కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారు.. మీ ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిరది.. మీ సంఘాలు ఎప్పుడు వచ్చినా సమస్యలు విని పరిష్కరించే ప్రయత్నం చేశాం.. ఎక్కడైనా కొంత ఆలస్యం కావచ్చు కానీ సమస్య పరిష్కరించకుండా ఉండలేదు.. తెలంగాణ పునర్నిర్మాణంలో మీ సేవలు అవసరం.. ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువ విద్యావంతులు, సామాజిక బాధ్యత తెలిసిన వారు.. టీచర్లకు జీతాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు.. మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది’ అని వివరించారు. అందుకే అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో స్వయం సహాయక సంఘాలకు నిర్వహణ బాధ్యత అప్పగించామన్నారు. ప్రతీ ఏటా ర130 కోట్లు స్కూల్స్ నిర్వహణకు నిధులు మంజూరు చేస్తున్నామని, చదువొక్కటే పేదల తల రాతను, రాష్ట్రం తలరాతను మారుస్తుంది అని అన్నారు. టీచర్లు అంటే ఒక కుటుంబ పెద్దగా భావించండి.. పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన సమయంలో పిల్లలతో కలిసి ఉపాధ్యాయులు భోజనం చేసినప్పుడే తప్పులు జరగకుండా ఉంటాయని సూచించారు. గతంలో ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గేది.. కానీ తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మూడు లక్షలు పెరిగింది.. ఇందులో ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది అంటూ ఉపాధ్యాయుల కృషిని అభినందిస్తున్నా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా తీర్చిదిద్దుదామని ప్రతినబూనుదాం విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుంది.. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా మన విద్యార్థులను తీర్చిదిద్దుదాం అని చెప్పారు. తెలంగాణకు ఒక నూతన ఎడ్యుకేషన్ పాలసీ అవసరమని, పేద పిల్లల జీవితాలను మార్చేలా ఆ పాలసీ ఉండాలని అన్నారు. అందుకే ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించేందుకు ఒక కమిటీని నియమించామని చెప్పారు. పునాది బలంగా ఉన్నప్పుడే ఎన్ని అంతస్తులైనా కట్టొచ్చు.. విద్య విషయంలోనూ పునాది బలంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. పాఠశాల విద్యనే కాదు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచిస్తున్నానన్నారు. వరల్డ్ బెస్ట్ మోడల్‌గా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్‌ను నిర్మిస్తున్నాం.. నిరుద్యోగ యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం.. 65 ఐటీఐలను టాటా కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్‌గా ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేశాం.. దేశ ప్రతిష్టను పెంచేలా తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నాం.. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయండి.. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలపై ఆసక్తి ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించండి చదువుతోనే కాదు.. క్రీడల్లో రాణించినా మంచి భవిష్యత్తు ఉంటుందని అవగాహన కల్పించండి అని ముఖ్యమంత్రి ఉపాధ్యాయ లోకానికి సూచించారు. విద్యార్థులు డ్రగ్స్, గంజాయి లాంటి తప్పుదారిలో పడకుండా చూడాల్సిన బాధ్యత మీపైనా ఉందన్నారు. తెలంగాణలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ ఫోర్స్‌ను తీసుకొచ్చామన్నారు. విద్యార్థుల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు.. ఆ భవిష్యత్తును మీ చేతుల్లో పెడుతున్నా.. మీరు, నేను కలిసి తెలంగాణను పునర్నిర్మించుకుందాం.. ఇందుకు అందరూ కలిసిరావాలని విజ్ఞప్తి చేస్తున్నా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





