– ఆ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం
– ఈటీ టెక్ ఎక్స్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: మారుతున్న ప్రపంచ అవసరాలకనుగుణంగా విద్యావ్యవస్థలో సమూలమైన, విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెండేళ్లుగా విద్యారంగాన్ని అత్యున్నత ప్రాధాన్యతాంశంగా గుర్తించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అనే లక్ష్యంతో ప్రభుత్వం పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నదన్నారు. బ్రెయిన్ ఫీడ్ గ్రూప్ ఆధ్వర్యంలో హైటెక్స్‌లో శనివారం నిర్వహించిన ఈటీ టెక్ ఎక్స్-2025 కార్యక్రమానికి మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధ్యాయుల భర్తీ, డిజిటల్ లెర్నింగ్, స్కిల్ ఎడ్యుకేషన్ వరకు ప్రతి దశలో సమగ్ర మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. వేగంగా మారుతున్న విద్యా ప్రపంచంలో ఈటీ టెక్ ఎక్స్ వంటి వేదికలు అత్యంత అవసరమని, టెక్నాలజీ-విద్య కలిసి భవిష్యత్తును ఎలా నిర్మించాలి అనే అంశంపై ఆలోచించేందుకు, చర్చించేందుకు ఇవి దిశానిర్దేశం చేస్తున్నాయని అన్నారు. కుల, మత భేదాలకతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులందరూ ఒకే క్యాంపస్‌లో అన్ని సౌకర్యాలతో కలిసి చదువుకునేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను రాష్ట్రంలోని 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభుత్వం రూ.21వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో 2024 డీఎస్సీ ద్వారా పది వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారని చెప్పారు. 2024 సెప్టెంబర్ నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యం అమలు చేస్తున్నామని, దీనికోసం ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.140 కోట్ల వ్యయాన్ని భరిస్తోందని వెల్లడించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ.642 కోట్లతో మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేశామన్నారు. పాఠశాలల పరిశుభ్రత, తరగతి గదుల మరమ్మతులు, నిర్వహణ బాధ్యతలను ఆ కమిటీలకు అప్పగిస్తూ రూ.146 కోట్లు కేటాయించామన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణతోపాటు ఉద్యోగావకాశాల కల్పనకు తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. ఈ యూనివర్సిటీ ఈ సంవత్సరంనుంచే స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రారంభించనుందని, పరిశ్రమల అవసరాలకనుగుణంగా శిక్షణ ఇచ్చి యువతకు తక్షణ ఉపాధి కల్పించడమే లక్ష్యమన్నారు. అదేవిధంగా యువత పరిశ్రమలకు తగిన నైపుణ్యాలు నేర్చుకునేలా ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విద్యతోపాటు క్రీడలకు కూడా ప్రభుత్వం విశేష ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ఈ లక్ష్యంతో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా తెలంగాణను క్రీడల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చరిత్రాత్మక ముందడుగు వేశామని పేర్కొన్నారు. అన్ని చర్యలతో విద్యార్థులకు విస్తృత అవకాశాలు లభిస్తాయని, యువతకు ఉపాధి అవకాశాలు బలపడతాయని, రాష్ట్రంలో వృత్తి ఆధారిత విద్యకు బలమైన పునాది పడుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





