అసమానతలు రూపుమాపే ఆయుధం విద్య

– నైపుణ్యం, విలువలు ఉన్న విద్యనందించడమే మా లక్ష్యం
– ‘లయోలా’ గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: సమాజంలో పాతుకుపోయిన అసమానతలను రూపుమాపమే ప్రధాన ఆయుధం విద్య మాత్రమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మేడ్చల్‌ జిల్లా అల్వాల్‌లో లయోలా విద్యాసంస్థల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. నైపుణ్యంతోపాటు మానవ విలువలు కలిగిన విద్యనందించడమే సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని యావత్‌ కేబినెట్‌ లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగా భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో స్కిల్‌ యూనివర్సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలోని 100 ఐటిఐలను అడ్వాన్సుడ్‌ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని, ఇవి రాష్ట్ర యువతకు ఉపాధితోపాటు జీడీపీ పెరుగుదలకు ఉపయోగపడతాయని వివరించారు. సామాజిక ఆసమానతలను రూపుమాపే లక్ష్యంతో అన్ని వర్గాల విద్యార్థులు ఒకేచోట ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌తో చదువుకునేందుకు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మిస్తున్నామన్నారు. సమాజంలోనీ వ్యవస్థలు, సంస్థల్లో మార్పు విద్య ద్వారానే సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సిపెక్‌(సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల) సర్వే ద్వారా మరింత స్పష్టమైనదని డిప్యూటీ సీఎం వివరించారు. పది రోజుల క్రితం తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌లో 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిర్మించాలనే తమ లక్ష్యం గురించి మాట్లాడాను. ఆ సందర్భంలో నేను ఒక సరళమైన సూత్రాన్ని ప్రతిపాదించానని డిప్యూటీ సీఎం వివరించారు. మూలధనం ఆవిష్కరణ R ఉత్పాదకత. నిజం చెప్పాలంటే ఆ ఒక్క వాక్యం సమాజంలో ఇంతగా విస్తరిస్తుందని నేను ఊహించలేదు అని భట్టి అన్నారు. ఒక ఆలోచన వేదికను దాటి చర్చకు వస్తే అది నిజమైన లక్ష్యాన్ని చేరిందని అర్థం చేసుకోవచ్చన్నారు. మూలధనం, ఆవిష్కరణలు ఎంత ముఖ్యమైనవైనా అవి ఆధారపడే లోతైన పునాది ఒకటి ఉంది.. అదే మానవ మూలధనం అన్నారు. తెలంగాణ మౌలిక వసతులు, ఇంధనం, పట్టణాభివృద్ధిలో భారీగా పెట్టుబడులు పెడుతుండగా ఒక విషయం మాకు స్పష్టం అవుతోంది. తదుపరి గొప్ప మార్పు కేవలం కాంక్రీటుతో రాదు.. అది తరగతి గదులు, ప్రయోగశాలలు, వర్క్‌షాప్‌లు.. ఆలోచనల నుంచే వస్తుంది అన్నారు. విద్యార్థి మిత్రులారా మీరు నిరంతరం మార్పు జరిగే ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.. టెక్నాలజీ మారుతుంది.. ఉద్యోగ హోదాలు మారతాయి.. కొన్ని పరిశ్రమలు పుడతాయి.. కొన్ని అంతరించిపోతాయి.. అలాంటి ప్రపంచంలో మీకు అత్యంత విలువైన సంపత్తి ఒక్క నైపుణ్యం కాదు నేర్చుకోవడం, మర్చిపోవడం, మళ్లీ నేర్చుకోవడం అనే నిరంతర అభ్యసన సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది అని డిప్యూటీ సీఎం తెలిపారు. మీ విద్యను కేవలం జీవనోపాధి కోసమే కాక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నించడానికి, అర్థవంతంగా సహకరించడానికి వినియోగించుకోండి అని ఉద్బోధించారు. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, మైనంపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *