అయోమయంలో కేయూ విద్యా విభాగం

– కొందరు పార్ట్‌ టైమ్‌ అధ్యాపకులతో సమస్యలు
– వీరి వల్ల రాజీనామాలు చేస్తున్న విభాగాధిపతులు
– వైస్‌ చాన్స్‌లర్‌ యూనివర్సిటీ ప్రతిష్టను కాపాడాలి

హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4: కాకతీయ విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్‌ విభాగంలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎప్పుడు ఎవరు బాధ్యులుగా వస్తారో, ఎవరు వెళ్ళిపోతారో తెలియని అయోమయంలో విద్యా విభాగం కొట్టుమిట్టాడుతోంది. తాజాగా ఈ విభాగం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా ఆ విభాగం హెడ్‌ ప్రొఫెసర్‌ వల్లూరి రామచంద్రంను నియమిస్తూ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సమర్ధుడైన వ్యక్తిగాి పేరున్న ప్రొఫెసర్‌ తాళ్లపల్లి మనోహర్‌ ఈ విభాగం బాధ్యతల నుండి రాజీనామా చేయడం పట్ల సర్వత్రా చర్చ జరుగుతోంది. విద్యా విభాగంలో జరుగుతున్న పలు అవకతవకలను గుర్తించి విశ్వవిద్యాలయం ఉన్నత పాలకవర్గానికి నివేదించిన ప్రొఫెసర్‌ మనోహర్‌ పని విధానంపై విద్యాలయంలో ప్రశంసలు కూడా లభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విభాగం గాడిన పడుతుందనుకున్న సమయంలోనే ఆ బాధ్యతలను నిత్యం వివిధ పరిపాలన పనుల్లో బిజీగా ఉండే ప్రొఫెసర్‌ వల్లూరికి అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఇటీవల ఈ విభాగంలో అక్రమాలకు పాల్పడి, దురుసుగా వ్యవహరించిన ఓ పార్ట్‌ టైం అధ్యాపకుడికి మెమోలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఉదాసీనంగా వ్యవహరించాలని ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడి నుంచి విశ్వవిద్యాలయంలోని ముఖ్య అధికారులపై తీవ్రమైన ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. అయితే గతంలోనే ఓ కాంట్రాక్టు అధ్యాపకుడు కూడా పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడిన వ్యవహారంలో బోధనా విధుల నుంచి తప్పించారు. అయితే తన వ్యవహారంలో కూడా ఉద్వాసన పలికే అవకాశం ఉందని ముందుగానే గుర్తించిన నా పార్ట్‌ టైం అధ్యాపకుడు రాజకీయ ఒత్తిళ్ల ద్వారా విద్యా విభాగంలో కొనసాగడానికి ప్రయత్నిస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. తాత్కాలిక ఉద్యోగాల్లోని అధ్యాపకులు అక్రమాలకు పాల్పడినప్పుడు అందరికీ ఒకే న్యాయం ఉండాలని ఒకే విధమైన శిక్షా సూత్రాలు పాటించాలని ఓ ప్రొఫెసర్‌ వాదించడం విద్యా విభాగంలో చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం. మరోవైపు దూర విద్యా కేంద్రంలో పనిచేస్తున్న డాక్టర్‌ నల్లాని శ్రీనివాస్‌రావును విద్యావిభాగం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా నియమించే ఆలోచన చేస్తున్నట్టు వినికిడి. ఇప్పటికే రెగ్యులర్‌ ప్రొఫెసర్లు లేకపోవడం వల్లనే కేయూ ఎడ్యుకేషన్‌ విభాగంలో పరిపాలన గాడి తప్పి విశ్వవిద్యాలయం కింద ఉన్న పలు బీఈడీ కళాశాల యజమానులు, అధ్యాపకులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు విశ్వవిద్యాలయ కాంట్రాక్టు అధ్యాపక సంఘంలోని మరో వర్గం అక్రమార్కులను తొలిసారిగా క్షమించాలని కోరుతూ విశ్వవిద్యాలయ అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా ఈ వ్యవహారంలో విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ కర్నాటి ప్రభాకర్‌ రెడ్డి వాస్తవాలను విచారించి విద్యా విభాగం పరువు ప్రతిష్టలను కాపాడేందుకు సరైన నిర్ణయం తీసుకోవాలని విద్యావంతులు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు కోరుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *