– రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
వికారాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సమూల మార్పుల కోసం అధ్యయనం చేయడం జరుగుతుందని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. సోమవారం రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి వికారాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ డిగ్రీ డైట్ కళాశాలలను కమిషన్ సభ్యులు డా.పి ఎల్. విశ్వేశ్వరరావు, డాక్టర్ చారుకొండ వెంకటేష్, జ్యోత్స్నా ,శివారెడ్డి లతో కలసి ఆకస్మికంగా తనిఖీ చేసి మౌలిక సదుపాయాలు బోధన సిబ్బంది విద్యార్థుల సంఖ్య పై ఆరా తీశారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలోని మౌలిక వసతులు, చేపట్టాల్సిన పనులపై ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందజేస్తామన్నారు. ప్రభుత్వ కళాశాలలోని మౌలిక సదుపాయాలు బోధన సిబ్బంది తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు జిల్లా కమిషన్ సభ్యులతో కలిసి వచ్చామన్నారు. అధ్యాపకుల విద్యార్థుల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. గెస్ట్ ఫ్యాకల్టీ సమస్యలు కూడా తమ దృష్టికి వచ్చాయని అధ్యాపకుల సమస్యలను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కమిషన్ చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) విద్యార్థులు తమకు ఇంగ్లీషు, ఉర్దూ పాఠ్యపుస్తకాలు అందుబాటు లేవని, వసతి గృహ సదుపాయాలు కల్పించాలని కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు.కమిషన్ చైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ పాఠ్యపుస్తకాల సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. డైట్ ఆవరణలో ఉన్న వసతి గృహంలో అన్ని మరమ్మతు పనులు చేపట్టి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నిర్వహించేందుకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ను విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి పాఠశాల స్థాయి నుండి డిగ్రీ కళాశాల వరకు చేపట్టాల్సిన విద్యాబోధన విధానం చేపట్టాల్సిన విధివిధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా స్పీకర్ విద్యా కమిషన్ చైర్మన్ సభ్యులను శాలువాలతో సత్కరించారు. జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్ నాయక్ డీఈఓ రేణుకా దేవి ప్రిన్సిపాల్ లు గీతా లక్ష్మీ, పట్నాయక్, రామాచారి లు పాల్గొన్నారు.
————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





