విద్య, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం

– యుద్ధప్రాతిపదికన హాస్టల్ భవనాల మరమ్మతులు
– దేశంలోనే మోడల్ గా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు
– వసతి గృహాలు, గురుకులాల్లో అధికారులు త‌నిఖీలు చేయాలి
– లక్ష కోట్లకు పైగా నిధులతో రహదారుల నిర్మాణం
– సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరం జరగాలి
– ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18: రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని, ఈ రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎన్ని నిధులైన ఖర్చు చేసేందుకు ప్రభుత్వం వెనుకాడబోదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో మైనారిటీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, రోడ్డు రవాణా, నీటిపారుదల శాఖ, సివిల్ సప్లయిస్, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల ప్రీ బడ్జెట్ సమావేశాలు బుధవారం జరిగాయి. మంత్రి అజారుద్దీన్ తో కలిసి మైనార్టీ సంక్షేమ శాఖ సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఆలోచించి, నిబద్దతతో ప్రాధాన్యతను గుర్తించి, ఆదాయం-ఖర్చుపై దృష్టి సారించి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సంక్షేమ శాఖకు సంబంధించి వసతి గృహాలు, గురుకులాల బిల్లులు ఎంత తొందరగా పంపితే అంత తొందరగా క్లియర్ చేస్తామని, వసతి గృహాల భవనాల మరమ్మతులు వేగంగా పూర్తిచేయాలని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ కు బయోమెట్రిక్ విధానం లేకపోతే వెంటనే అమలులోకి తీసుకురావాలని వాటిని కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయాలని ఆదేశించారు.వసతి గృహాలు, రెసిడెన్షియల్ బిల్డింగ్ ల పైన సోలార్ పవర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీతో సమావేశమై ఏర్పాటు చేసుకోవాలని కరెంటు భారం లేకుండా చేసుకోవడమే కాదు, సోలార్ ద్వారా ఆదాయం సృష్టించుకోవచ్చని తెలిపారు. జిల్లా అధికారులు, రాష్ట్రస్థాయి అధికారులు వసతి గృహాలను సందర్శించి అన్ని విషయాలను పరిశీలించాలని వీలైతే ఒక రోజు రాత్రి అక్కడే బస చేయాలని గతంలోనే ఆదేశించాం.. ఆ ప్రక్రియ ఎంతమేరకు కొనసాగుతుందో సెక్రటరీలు ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు.

పంట మార్పిడికి అవకాశాలను పరిశీలించాలని నీటిపారుదల శాఖ సమావేశంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సూచించారు. వరి స్థానంలో పామ్ ఆయిల్, పప్పు ధాన్యాలు సాగు చేస్తూ పంట నిలువల స్టోరేజ్‌సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు గ్రీన్ చానెల్ ద్వారా డైట్ & కాస్మొటిక్ ఛార్జీలు విద్యార్థులకు స్కాలర్ షిప్ లు విడుదల చేస్తుందన్నారు. ఈసారి బడ్జెట్ లో బీసీలలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి,  వారి ఆర్థిక వృద్ధికి ప్రత్యేక పథకాలు ప్రారంభించాలని కోరామ‌ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే ఆర్టీసీలో ప్రయాణించే మహిళలకు మహా లక్ష్మీ కార్డులను ఇంటింటా పండుగ‌లా అందిస్తామ‌న్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ప్రారంభించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం వివరించారు. దేశంలో, రాష్ట్రంలో అత్యుత్తమ ఉపాధ్యాయులను గుర్తించి హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో పాఠాలు బోధిస్తారని , ఇది దేశంలోనే ఒక మోడల్ గా మారబోతుందని తెలిపారు. లోయర్ ట్యాంక్ బండ్, కాచిగూడ కేంద్రంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న విలువైన స్థలాల్లో భారీ భ‌వంతులు నిర్మించి విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు భవనాలు నిర్మించే ఆలోచనలు చేయాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ తెలిపారు.సంక్షేమ వసతి గృహాలు, హాస్టల్లో మోడల్ కిచెన్లు ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలించాలని, ఈ ప్రక్రియను దశలవారీగా ప్రారంభించాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. లక్ష కోట్లకు పైగా నిధులతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం జరుగుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. హైదరాబాద్- విజయవాడ, ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు, రావిర్యాల నుంచి శ్రీశైలం వరకు రహదారుల నిర్మాణం పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి హడ్కో నుంచి రుణం తీసుకునేందుకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రీ బడ్జెట్ సమావేశంలో సంతకం చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు మంత్రి కోమటిరెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంలో సంవత్సరం పొడుగునా కల్చరల్ యాక్టివిటీ కొనసాగేలా సినిమాటోగ్రఫీ శాఖలో ప్రణాళిక రూపొందించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సంక్షేమ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్, రవాణా, రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, సివిల్ సప్లై శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సంక్షేమ శాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్య, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *