విద్యా విధానంలో మార్పులు తేవాలి

– అంతర్జాతీయ స్థాయికి సరితూగని ప్రస్తుత విధానం
– యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే లక్ష్యం
– నూతన విద్యా విధానం సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: విద్యా విధానాన్ని ప్రక్షాళన చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, విధానంలో మార్పులతోపాటు పేదరిక నిర్మూలన జరగాలి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సెక్రటేరియట్‌లో తెలంగాణ విద్యా విధానంపైన సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ గతంలో తెలంగాణ విద్యలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాయని, ప్రస్తుతం ఓపెన్‌ మార్కెట్‌ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదని, యేటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నా వారిలో 15 శాతం మందికే ఉద్యోగాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యలో ప్రభుత్వ పాత్ర తగ్గిపోతున్నదని, విద్యా శాఖకు రూ.21 వేల కోట్లు కేటాయిస్తే అందులో 98 శాతం జీతాలకే ఖర్చు అవుతున్నదని చెప్పారు. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గం అని, విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం విద్యావేత్తలను కోరారు. 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే తన లక్ష్యమని, దేశ విద్యా విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలని ఆకాంక్షించారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళికాబద్దంగా పనిచేయాలన్నారు. 11 వేల ప్రైవేట్‌ స్కూల్స్‌లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా ఏడు వేల ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని గణాంకాలు తెలిపారు. విద్య కోసం తీసుకునే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్ధిక మంత్రిని కోరామని, 1 నుంచి 12 తరగతుల వరకు సమూల మార్పులు రావాలని, విద్య విషయంలో సమాజానికి మేలు జరుగుతుందంటే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా తాను సిద్ధమని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో నూత‌న పాల‌సీ రూపొందించేందుకు ఏర్పాటు చేసిన క‌మిటీ చైర్మ‌న్‌ కె.కేశవ రావు, సభ్యులు ఆకునూరి మురళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎడ్యుకేషన్‌ సెక్రటరీ యోగితా రాణా, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టా రెడ్డి, ఎంఎల్సీ లు కోదండరాం, శ్రీపాల్‌ రెడ్డి, ఏవీఎన్‌ రెడ్డి, మల్క కొమరయ్య,
విద్యావేత్తలు,అ న్ని యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్స్‌ , సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *