– 105 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూల్స్
– కేంద్ర మంత్రి నిర్మలమ్మకు సీఎం రేవంత్ వినతి
దిల్లీ, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో విద్యా రంగంలో సమూల మార్పులు తేవడానికి తాము చేస్తున్న కృషికి మద్దతు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సుమారు 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లోని పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. నార్త్ బ్లాక్‌లోని కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఆమెతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 105 శాసనసభ నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నాలుగు పాఠశాలల నిర్మాణ పనులు మొదలయ్యాయని, మిగతా పాఠశాలలకు సంబంధించి టెండర్లు ముగిశాయని చెప్పారు. ఒక్కో పాఠశాలలో 2,560 మంది విద్యార్థులు ఉంటారని, 2.70 లక్షల మంది విద్యార్థులకు ఈ పాఠశాలల్లో చదువుకునే అవకాశం లభిస్తుందని సీఎం వివరించారు. అత్యాధునిక వసతులు, ల్యాబ్‌లు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్యయమవుతుందన్నారు. అలాగే రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఆధునిక ల్యాబ్‌లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. ఈ నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతించడంతోపాటు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి నుంచి మినహాయించాలని కేంద్ర మంత్రి నిర్మలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంపై చేస్తున్న వ్యయాన్ని పెట్టుబడిగా పరిగణించాలని కోరారు. గత ప్రభుత్వం ఇష్టారీతిగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చిందని, వాటి చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారిన నేపథ్యంలో వాటి రీస్ట్రక్చరింగ్‌కు అనుమతించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఈ విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, పోరిక బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే