చోక్సీ, నీరవ్‌ మోదీ కేసులో ఈడీ దర్యాప్తు

– చోక్సీ తనయుడు రోహన్‌కు కూడా సంబధం
– దిల్లీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు వివరాలు

న్యూదిల్లీ, జనవరి 16: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ.వేల కోట్లు ఎగవేసి పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరస్తుడు మెహుల్‌ చోక్సీ కేసుపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా కొనసాగుతోన్న దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు తాజాగా కీలక విషయం వెల్లడించారు. ఈ మనీలాండరింగ్‌ కేసులో ఛోక్సీ కుమారుడు రోహన్‌ చోక్సీకి కూడా సంబంధం ఉన్నట్లు తెలిపారు. ఈమేరకు దిల్లీలోని అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు వివరాలు అందజేశారు. మెహుల్‌ చోక్సీ డైరెక్టర్‌గా ఉన్న లస్టర్‌ ఇండస్టీస్ర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో రోహన్‌ చోక్సీకి 99.99 శాతం వాటా ఉందని, ఈ కంపెనీ నిధులను విదేశాలకు మళ్లించడానికి ఉపయోగించుకున్నారని దర్యాప్తులో తేలినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. నగదు అక్రమ చలామణిలో రోహన్‌ చోక్సీ చురుకుగా పాల్గొన్నట్లు తగిన ఆధారాలు ఉన్నాయన్నారు. దీంతో అతడి ఆస్తులను అటాచ్‌ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రోహన్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులను కూడా విచారించడానికి ఈడీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి తీసుకున్న దాదాపు రూ.13 వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్‌ మోదీ దేశం విడిచి పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా`బార్బుడాకు వెళ్లగా నీరవ్‌ మోదీ లండన్‌లో ఆశ్రయం పొందాడు. ప్రస్తుతం నీరవ్‌ లండన్‌లోని జైల్లో ఉన్నాడు. వారిని భారత్‌కు తీసుకురావడానికి విదేశాంగ అధికారులు ఆయా దేశాల అధికారులతో చర్చలు జరుపుతున్నారు.

—————————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *