మహిళల ఆర్దిక వృద్ధితోనే దేశ ప్రగతి

– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే మహిళా సాధికారత
– కేంద్ర మంత్రులను ఆకట్టుకున్న మంత్రి సీతక్క ప్రసంగం
– తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్న వక్తలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: మహిళా సాధికారతే దేశ ప్రగతికి పునాది అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. హైదరాబాద్‌లో జాతీయ ఆర్థిక సాక్షరత సదస్సు, 25వ కేంద్రస్థాయి సమన్వయ కమిటీ సమావేశం శనివారం ఘనంగా జరిగింది. సమావేశానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి సీతక్క విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. మంత్రి సీతక్క ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనల ఆధారంగా మహిళల అభివృద్ధే సమాజ అభివృద్ధిగా భావిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. దేశంలో యంగెస్ట్ స్టేట్ అయిన తెలంగాణ సగటున 12.9 శాతం వార్షిక వృద్ధి రేటుతో వేగంగా అభివృద్ధి చెందుతోందని, పేదరికాన్ని తగ్గించడంలో నీతి ఆయోగ్ ప్రశంసలు అందుకుందని గుర్తు చేశారు. తెలంగాణ విజయాలకు ప్రధాన కారణం గ్రామీణ మహిళలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములుగా మార్చడమేనని ఆమె స్పష్టం చేశారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలను స్వయం ఉపాధి నుంచి సంపద సృష్టి దిశగా తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 46.68 లక్షల మహిళలు 4.37 లక్షల స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. గత రెండేళ్లలో రూ.35,435 కోట్ల బ్యాంకింగ్ రుణాలు మంజూరు చేయించి ఆర్దికంగా ఎదిగేలా కృషి చేస్తున్నామన్నారు. ఎస్‌హెచ్‌జీ ఎన్‌పీఏ కేవలం 1.40 శాతమేనని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా సంఘాలకు రూ.1,121 కోట్ల వడ్డీ సబ్సిడీ మాఫీ చేశామన్నారు. ఇందిరా మహిళా శక్తి కింద 2.05 లక్షల సూక్ష్మ వ్యాపారాలు స్థాపించడం ద్వారా రూ.3,612 కోట్ల ఆర్థిక కార్యకలాపాలు సృష్టించామని వెల్లడించారు. మహిళా సభ్యులకు రుణ, ప్రమాదభీమా వంటి రక్షణ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మహిళా సంఘాలకు ప్రభుత్వం ఆర్దిక చేయూతనివ్వగా వారు రూ.3.5 కోట్ల లాభాలు ఆర్జించడం మహిళల సామర్థ్యానికి నిదర్శనమన్నారు. మండల మహిళా సమాఖ్యల ద్వారా బస్సులు కొనుగోలు చేసి Tటీజీఎస్ ఆర్టీసీకి లీజుకు ఇవ్వడం, కమ్యూనిటీ క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా మహిళలకు స్థిర ఆదాయం కల్పిస్తున్నామని వివరించారు. దేశ జీడీపీలో మహిళల భాగస్వామ్యం కేవలం 18 శాతమే ఉండగా, అభివృద్ధి చెందిన దేశాల్లో అది 40 శాతానికి చేరుకుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ అంతరాన్ని తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకర్లు, అభివృద్ధి భాగస్వాములు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

‘లక్‌పతి దీదీ’ ద్వారా ఆర్థికంగా బలపరుస్తున్నాం :శివరాజ్ సింగ్ 

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్‌పతి దీదీ కార్యక్రమం ద్వారా మహిళలను ఆర్థికంగా బలపరుస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కోట్లాది మహిళలు ఎస్‌హెచ్‌జీల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వాములయ్యారని, తదుపరి లక్ష్యం మరింత విస్తరణేనని చెప్పారు. బ్యాంకర్లు కేవలం రుణదాతలుగా కాక భాగస్వాములుగా మారాలని సూచించారు. అభివృద్ది కార్యక్రమాల్లో రాజకీయాలకు తావు ఉండదని స్పష్టం చేశారు. మహిళల అభివృద్ది విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి సీతక్క ప్రసంగించడం అభినందనీయమన్నారు. దిల్లీ, హైదరాబాద్ కలిసి పనిచేయాలని, తెలంగాణతో ఎలాంటి వివక్ష ఉండదని హామీ ఇచ్చారు. దేశ అభివృద్ది కోసం రాజకీయాలు పక్కనపెట్టి తెలంగాణ ప్రభుత్వం కలిసి వస్తుందని, అందుకు తెలంగాణ సీఎం, మంత్రి సీతక్కను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి సీతక్క ప్రసంగాన్ని ప్రశంసిస్తూ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మహిళా సాధికారత సీతక్క స్వరంలో ప్రతిధ్వనించిందని పేర్కొన్నారు. మహిళల ఆర్దిక పరిపుష్టి దిశలో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీంను వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, బ్యాంకింగ్ సంస్థల ప్రతినిధులు, అన్ని రాష్ట్రాల ప్రతినిధులు, అభివృద్ధి భాగస్వాములు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, సెర్ఫ్ సీఈవో దివ్యాదేవరాజాన్, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు

కేంద్ర మంత్రికి పలు విజ్ఞప్తులు 

సదస్సు వేదికపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మంత్రి సీతక్క పలు వినతిపత్రాలను సమర్పించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం నిధులను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాలు స్థాపిస్తున్న సోలార్ ప్లాంట్లకు కేంద్రం అందిస్తున్న రాయితీల గడువును రాబోయే ఆర్థిక సంవత్సరాల వరకు పొడిగించాలని కోరారు. ఈ అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం, తెలంగాణ చేనేత కార్మికులు నేసిన శాలువాలతో కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులను మంత్రి సీతక్క సత్కరించారు. మహిళా స్వయం సహాయక సంఘాలు రూపొందించిన గిఫ్ట్ ప్యాకులను వారికి అందజేశారు. మహిళా సంఘాల నైపుణ్యాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు అభినందించారు. వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, అధికారులు కు ఘన స్వాగతం పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *