– 2024-25లో నిర్మాణ రంగం వృద్ధి రేటు 11.97 శాతం
– కాంపోజిట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్ నిర్మాణాలకు ప్రోత్సాహం
– యువ సివిల్ ఇంజినీర్లు వినూత్నంగా ఆలోచించాలి
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 11: ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పట్టణీకరణ, కాలుష్యం, కర్బన ఉద్గారాల పెరుగుదల తదితర ఎన్నో సమస్యలకు పర్యావరణహిత నిర్మాణాలు పరిష్కారం చూపుతాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తోందని, ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావాలని సివిల్ ఇంజనీర్లను కోరారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్(హైదరాబాద్) సెంటర్ ఆధ్వర్యంలో రాయదుర్గంలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ‘నెక్స్ట్-జెన్ హైరైస్ బిల్డింగ్స్ (అడ్వాన్స్మెంట్స్ ఇన్ కాంపోజిట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్) అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. 2024-25లో నిర్మాణ రంగం 11.97 శాతం వృద్ధి రేటును నమోదు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.80 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చిందన్నారు. రాష్ట్ర సేవల స్థూల విలువ జోడిరపులో ఇది 24.9 శాతమని, ఈ గణాంకాలు తెలంగాణ నిర్మాణ రంగ ప్రగతికి నిదర్శనమని మంత్రి వివరించారు. ఇటీవల దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో హైరైస్ భవన నిర్మాణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని, హైదరాబాద్‌లో 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న భవనాల సంఖ్య 200 కంటే ఎక్కువగా ఉన్నాయని, మరో 250 భవనాల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయంటూ ఇలాంటి తరుణంలోనే పర్యావరణహితంగా అడుగులు వేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఈ తరహా భారీ భవనాల నిర్మాణంలో రీన్‌ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్(ఆర్‌సీసీ) నిర్మాణాలకు బదులుగా కాంపోజిట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్‌కు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ స్ట్రక్చర్స్ వినియోగం వల్ల భవనం పూర్తయ్యేందుకు పట్టే సమయం 40 శాతం, భారం 30 శాతం తగ్గుతుందని, భూకంపాలను సమర్థవంతంగా తట్టుకోగలవని, నిర్మాణ సమయంలో వెలువడే కాలుష్యం తగ్గుతుందని, మరీ ముఖ్యంగా పునర్వినియోగం వల్ల సర్క్యులర్ ఎకానమీ వృద్ధి చెందుతుంది అని వివరించారు. తెలంగాణలో ఆవిష్కరణలు కేవలం మాటలకే పరిమితం కావడం లేదు.. ఆచరణలోనూ చూపిస్తున్నాం.. భావితరాల కోసం కాంపోజిట్ స్టీల్ స్ట్రక్చర్స్ నిర్మాణాలను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నాం.. ఇందుకు నగరవాసులకు అందుబాటులోకి తెచ్చిన స్టీల్ వంతెనలు గొప్ప ఉదాహరణ అని చెప్పారు. నిర్మాణ రంగంలో ఏఐ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ వినియోగం, బిల్డ్ నౌ పోర్టల్ ద్వారా నిర్మాణ అనుమతుల్లో వేగం, జవాబుదారీతనం, విశ్వాసాన్ని పెంపొందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కాంపోజిట్ స్టీల్ హై-రైజ్ డిజైన్‌పై జాతీయస్థాయిలో ఒకే రకమైన మార్గదర్శకాలు(కోడ్) తెచ్చేలా కేంద్రం, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్)తో కలిసి పనిచేస్తామన్నారు. సంప్రదాయబద్ధంగా కాకుండా ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా వినూత్నంగా ఆలోచించాలని, కొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎల్లపుడూ సిద్ధంగా ఉంటుందని యువ సివిల్ ఇంజనీర్లకు ఆయన సూచించారు. స్మార్ట్ నగరాలు, స్థిరమైన గృహ నిర్మాణం, సుస్థిర మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేరుస్తామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ప్రతినిధులు ఎస్.జీ.ఎస్.మూర్తి, మహేందర్‌రెడ్డి, శేషాద్రి, కాశీరాం, నర్మద, రమేష్, భీంరావు తదితరులు పాల్గొన్నారు.





