- 33°సెం. దాటిన ఉష్ణోగ్రత
- కొబ్బరి బోండాలు, పండ్ల రసాలతో సేదతీరుతున్న ప్రజలు
సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : నిన్నమొన్నటి వరకూ తీవ్రమైన చలితో వణికిపోయిన జిల్లా ప్రజలు ఇప్పుడు మండుతున్న ఎండల (Summer Heat Wave)తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తుండగా, శనివారం గరిష్ఠంగా 33 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడంతో జనం చెమటలు కక్కారు. ఫిబ్రవరిలోనే ఇలా ఉష్ణోగ్రతలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. “ఇప్పుడే ఇలా ఉంటే… మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో!” అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. మధ్యాహ్నం వేళ ప్రధాన రహదారులపై రాకపోకలు తగ్గిపోగా, నీడ ప్రదేశాల్లోనే జనసంచారం ఎక్కువగా కనిపిస్తోంది.
కొబ్బరి బోండాలకు పెరిగిన డిమాండ్
ఎండల తీవ్రత పెరగడంతో చల్లని పానీయాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కొబ్బరి బోండాలు, చెరుకురసం, పుచ్చకాయ, ఖర్బూజా, ద్రాక్ష వంటి పండ్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. సిరిసిల్ల పట్టణంతో పాటు ప్రధాన రహదారులు, హైవేల వెంట వందకు పైగా ఫ్రూట్ జ్యూస్, కొబ్బరి బోండాల దుకాణాలు వెలిశాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే ప్రజలు కూడా వేడిని తట్టుకోవడానికి పండ్ల రసాలు సేవిస్తున్నారు.
ధరలు కూడా పెరుగుతున్నాయ్
- కొబ్బరి బోండం: ₹40 – ₹50
- చెరుకురసం గ్లాసు: ₹30
- పుచ్చకాయ: ₹50 – ₹150 (సైజు ఆధారంగా, కిలో రూ.20)
- ఖర్బూజా ప్లేట్: ₹20
ముందస్తు జాగ్రత్తలు అవసరం
వాతావరణ మార్పులతో వేసవి వేడి త్వరగా మొదలైనట్లు నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్న వేళల్లో అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని, తగినంత నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.మార్చి మొదట్లోనే ఈ స్థాయి వేడి నమోదు కావడం గమనార్హం. రాబోయే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.





