– మార్కెట్లో ఎటు చూసినా మిర్చి బస్తాలే
– ధరలు బాగుండడంతో రైతుల హర్షం
వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 6: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం భారీగా మిర్చి తరలి వచ్చింది. సుమారు 35 నుంచి 40 వేల బస్తాల మిర్చి అమ్మకానికి రాగా ఈ సీజన్‌లో ఇదే అధికం. దీంతో యార్డులో ఎటు చూసినా మిర్చి బస్తాలే దర్శనమిచ్చాయి. అంతటా ఎర్ర రంగు సంతరించుకుంది. మిర్చి ధరలు గత సంవత్సరంతో పోలిస్తే మెరుగ్గా ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మార్కెట్‌లో మంచి నాణ్యత ఉన్న మిర్చికి శుక్రవారం గరిష్ఠంగా పలికిన ధరలు ఇలా ఉన్నాయి. తేజ రకం క్వింటాకు రూ.18,800, వండర్‌హాట్ రూ.35వేలు, యూఎస్.341 రూ.21వేలు, దీపిక రూ.30వేలు, ఎల్లో మిర్చి రూ.20 వేలు, సింగిల్‌పట్టి రూ.40 వేలు, దేశీ మిర్చి రూ.40 వేలు, తాలు క్వింటాకు రూ.12వేలు పలికింది. ఇటీవల చపాట మిర్చి ధరలు బాగా పెరిగాయి. నాలుగేళ్ల తరువాత దేశీ మిర్చి ధరలు పుంజుకుంటున్నాయి. 2021-22లో ముఖ్యంగా దేశీ మిర్చి ధర క్వింటాకు రూ.లక్ష వరకు పలికింది. ఆ తరువాత నాలుగేళ్లుగా రూ.30వేల నుంచి రూ.40వేలు, తేజ, వండర్‌హాట్, యూఎస్ 341 లాంటి రకాలకు రూ.12వేల నుంచి రూ.16వేల ధరలు పలికాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. అనేకమంది మిర్చి బస్తాలను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. ప్రస్తుత సీజన్‌లో కొంతకాలంగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. జియోట్యాగింగ్ కలిగిన దేశీ మిర్చికి విదేశాలలో మంచి డిమాండ్ ఉండడంతో ఎగుమతులకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. వరంగల్ మార్కెట్లో గత నెల మొదటి వారంలో మిర్చి సీజన్ ప్రారంభం కాగా తొలుత క్వింటాకు రూ.16,300 నుంచి రూ.16,800 వరకే సగటు ధరలు ఉన్నాయి. మార్కెట్‌కు వరుస సెలవుల అనంతరం సగటు ధర రూ.17,011 ఉండగా క్రమంగా పెరుగుతూ తాజాగా రూ.18,489కి చేరింది. ఖమ్మం, వరంగల్ మార్కెట్ల రాబడులు, కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న నిల్వలు, ఇతర దేశాల ఎగుమతుల అంశాలన్నీ ఇక్కడి మిర్చి ధరలను ప్రభావితం చేస్తున్నట్లు వ్యాపారులు విశ్లేషిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





