- డ్రగ్ కార్టెల్‌లో ఉన్న 50మంది నైజీరియన్ల అరెస్ట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: దేశ రాజధాని దిల్లీలో తెలంగాణ ఈగిల్ టీమ్ భారీ ఆపరేషన్ చేపట్టి డ్రగ్ కార్టెల్‌లో కీలక సభ్యులుగా ఉన్న 50 నైజీరియన్లను పట్టుకుంది. వీరంతా వీసా గడువు ముగిసినా మన దేశంలో తిష్టవేసి కూర్చుకున్నారు. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు కృషిచేస్తున్న ఈగల్ పోలీసులు ఈ భారీ ఆపరేషన్లు పూర్తి చేశారు. దిల్లీ, గ్రేటర్ నొయిడా, గ్వాలియర్, విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దిల్లీలో అక్కడి క్రైమ్ బ్రాంచ్ సమన్వయంతో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్‌ను చేపట్టింది. ఈ సంయుక్త బృందంలో దిల్లీ క్రైమ్ బ్రాంచ్ నుంచి వందమంది అధికారులు, ఈగల్ ఫోర్స్ నుంచి 124 మంది అధికారులు పాల్గొన్నారు. మెహ్రౌలి, సంత్ నగర్, ప్రతాప్ ఎన్‌క్లేవ్, పృథ్వీ పార్క్, చంద్ర నగర్ తదితర 20కి పైగా ప్రాంతాల్లో ప్రత్యేక తనీఖీలు చేపట్టారు. గడువు ముగిసిన వీసాలతో నివసిస్తున్న 50 మందికి పైగా నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారంతా ఒక పెద్ద నైజీరియన్ డ్రగ్ కార్టెల్‌లో కీలక సభ్యులుగా ఉన్నట్లు గుర్తించారు. పలు ప్రాంతాల్లో భారీగా మాదకద్రవ్యాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ నొయిడా, గ్వాలియర్, విశాఖపట్నంలోనూ ఈగల్ ఫోర్స్ స్థానిక పోలీసుల సహకారంతో కీలక ఆపరేషన్లు చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో డ్రగ్ కింగ్‌పిన్‌లను, సెక్స్ వర్కర్లుగా వ్యవహరిస్తూ డ్రగ్స్ విక్రయించే మహిళలు, మ్యూల్ ఖాతాదారులను గుర్తించింది. ముందస్తు పక్కా సమాచారంతో ఈగిల్ బృందం అక్కడి పోలీసుల సహకారంతో దీనిని చేపట్టింది. నైజీరియన్లను విచారిస్తే మరిన్ని వివరాలు రాబట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




