– ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
కొల్లాపూర్, ప్రజాతంత్ర, ఆగస్టు 2: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు జరిగేలా జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమశిల తెలంగాణ టూరిజం గెస్ట్‌హౌస్ వద్ద జిల్లా అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, తూడి మేఘారెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులు, గురుకులాలు, విద్య, వైద్యం, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఉప ముఖ్యమంత్రి నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో లోటుపాట్లకు తావు లేకుండా నిజమైన లబ్ధిదారులకు అవి అందేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో ఆయా పథకాలు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. పథకాలను పటిష్టంగా అమలుకు అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా విద్యాపరంగా గురుకులాల్లో విద్యార్థులకు ఇలాంటి సమస్యలు లేకుండా అధికారులు పూర్తిస్థాయిలో పరిరక్షించి మెరుగైన వసతులు కల్పించాలన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కృష్ణా నదిపై సాగునీటి ప్రాజెక్టులైన పాలమూరు-రంగారెడ్డి, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపైనా సమీక్షించారు. సమీక్షలో ప్రాజెక్టు సీఈ విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలమూరుIరంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఉద్దండాపూర్ వరకు పొడిగించడంతోపాటు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, కొల్లాపూర్ నియోజవర్గం సోమశిల వద్ద శ్రీశైలం వెనుక జలాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బోటులో పర్యటించి టూరిజం అభివృద్ధికి ఇక్కడ ఉన్న అవకాశాలను పరిశీలించారు.





