– అధికారుల అలసత్వాన్ని సహించం
– ప్రజా సంక్షేమమే మా లక్ష్యం
– ఖమ్మం కలెక్టరేట్‌లో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష
– బాలికల గురుకుల కళాశాల ఆకస్మిక సందర్శన
ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకం లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆయా అధికారులు, ఉద్యోగుల అలసత్వాన్ని ప్రభుత్వం సహించదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హెచ్చరించారు. ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టామని, ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజలకు అందరం జవాబుదారీగా ఉండాలని హితవు పలికారు. ఉద్యోగులు, అధికారులు ప్రతిరోజూ నిద్రపోయే ముందు ఆరోజు తమ విధి నిర్వహణ గురించి ప్రశ్నించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగం లభించడం అదృష్టం.. అది కొందరికే దక్కే అవకాశం.. సామాన్య పౌరునికి సేవలందించి బాధ్యతగా ఉండాలి.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఉండాలి అన్నారు. మన బిడ్డలే రాష్ట్ర భవిష్యత్తు.. వారు ప్రపంచంతో పోటీపడాలనే ఆలోచనతో మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రం ఎదిగేందుకు 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించాం.. మానవ సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున సంపద సమకూరుతుంది అని డిప్యూటీ సీఎం వివరించారు. డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంచామంటూ న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా విద్యార్థులకు మంచి ఆరోగ్యం అందించి విలువైన మానవ వనరులు సృష్టించాలనేది ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ మొదలు అధికారులు అందరూ విద్యాసంస్థలను పర్యవేక్షించి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ఈ కార్యక్రమం పక్కాగా జరిగితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఏదైనా సంఘటన జరిగితే అందుకు ఇన్‌చార్జి అధికారిని బాధ్యునిగా చేస్తామని స్పష్టం చేశారు. గోదాముల్లో వస్తువులు కుక్కినట్టుగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులను నమోదు చేసుకుంటున్నారని, ఇకనుంచి ప్రైవేటు విద్యాసంస్థలకు ఉండాల్సిన అర్హతలు, సౌకర్యాలపై ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని అవన్నీ ఉంటేనే అధికారులు అనుమతులు ఇవ్వాలని డిప్యూటీ సీఎం సూచించారు. సౌకర్యాలు లేని విద్యాసంస్థలను అప్‌గ్రేడ్ చేసుకోవాలని వెంటనే తెలియజేయాలన్నారు. సంక్షేమ రంగంపై ప్రభుత్వం స్పష్టంగా ఉందని, ఏళ్లతరబడి పెండిరగ్‌లో ఉన్న బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామని భట్టి వివరించారు. ప్రతి మూడు నెలలకు బిల్లులు సిద్ధం చేసుకుని రాకపోతే సంబంధిత కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే చెప్పామన్నారు. కాగా, గిరిజనులకు సమగ్ర వ్యవసాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇందిరా సౌర గిరి జలవికాసం పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. అటవీ భూ హక్కుల చట్టం కింద భూములు పొందిన రైతులకు ఉచితంగా సోలార్ విద్యుత్తు, పంపుసెట్లు, డ్రిప్పు, ప్లాంటేషన్ సౌకర్యాలు కల్పిస్తామని, అధికారులు ప్రతిపాదనలను వేగంగా పంపాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. అన్ని ప్రభుత్వరంగ సంస్థల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున వినియోగంలోకి తెచ్చుకోవాలని సూచించారు.
గిరిజన బాలికల గురుకుల కళాశాల ఆకస్మిక సందర్ 
సమీక్ష ముగించుకొని డిప్యూటీ సీఎం మధిర నియోజకవర్గ పర్యటనకు వెళ్లే క్రమంలో కొణిజర్ల మండలం తనికెళ్లలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా వసతి గృహంలోకి వెళ్లి భవనాన్ని పరిశీలించారు. విద్యార్థులు, ప్రిన్సిపాల్‌తో మాట్లాడారు. విద్యార్థుల సంఖ్య, మెనూ చార్ట్, మెనూ పాటిస్తున్నారా? లంచ్ టైం ఎన్ని గంటలకు.. ఈరోజు మెనూ ఏంటి.. ఇక్కడ చదువుకొని బయటకు వెళ్లిన విద్యార్థినులు ఏయే రంగాల్లో స్థిరపడ్డారో సమాచారం సేకరిస్తున్నారా లేదా వంటి వివరాలను ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. తదుపరి డైనింగ్ రూమ్‌లోకి వెళ్లి వంట పాత్రలను తనిఖీ చేశారు. ఆ తర్వాత విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తూ విద్యార్థినులు ఏయే ప్రాంతాల నుంచి వచ్చారు.. బోధన ఎలా ఉంది, రోజూ మెనూ పాటిస్తున్నారా లేదా అనే సమాచారం తెలుసుకున్నారు. తదుపరి లైబ్రరీని సందర్శించి గ్రూప్-1, గ్రూప్-2 వంటి పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారా, పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ లైబ్రరీలో ఉందా లేదా అనేది తెలుసుకున్నారు. దోమలు రాకుండా సువాసనలు వెదజల్లే అగరువత్తులను విద్యార్థినులు తయారు చేస్తున్న విధానాన్ని డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఈ అగరవత్తులను బ్రాండిరగ్ చేసి మార్కెట్‌లో విక్రయించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్‌ను ఆదేశించారు. విద్యార్థులకు హెల్త్ కార్డులు ఉన్నాయా లేదా అని ప్రశ్నించగా విద్యార్థుల హెల్త్ యాప్ గురించి ప్రిన్సిపాల్ వివరించారు. విద్యార్థినులు తాము వేసిన పెయింటింగ్‌ను డిప్యూటీ సీఎంకు బహూకరించారు. ఆ తర్వాత ఆయన గురుకులంలో మొక్కలు నాటారు.




