మస్యలు పరిష్కరించడం ప్రజాప్రతినిధి లక్ష్యం

– ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క .
– అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, రేషన్‌ కార్డులు పంపిణీ
– పాల్గొన్న మంత్రులు శ్రీధర్‌బాబు, స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌

తాండూరు, ప్రజాతంత్ర, జూలై 29: ప్రజా సమస్యల పరిష్కరించడం ప్రజాప్రతినిధి లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. తాండూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌, ఐటీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, శాసనమండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే భుయ్యాని మనోహర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌లతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి మాట్లాడుతూ గత పదేళ్లలో చేపట్టని పనులన్నింటనీ పెద్ద మొత్తంలో నిధులను కేటాయించి అమలు చేస్తున్నామని తెలిపారు. ఇంకా భవిష్యత్తులో అధిక నిధులను కేటాయిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో రేషన్‌ కార్డు లేని అర్హులైన పేదవారికి కార్డులను అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కోటి 20 లక్షల కుటుంబాలకు గాను 95 లక్షల కుటుంబాలకు రేషన్‌ కార్డులను అందిస్తున్నట్లు భట్టి తెలిపారు. ఇండ్లు లేని ప్రతి పేదవాడికి ఇంటి నిర్మాణాల నిమిత్తం ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా 3500 ఇళ్లు మంజూరు చేస్తూ ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారుడికి రూ.5 లక్షల చొప్పున నగదును జమ చేస్తున్నట్లు చెప్పారు. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి వైద్య సదుపాయి నిమిత్తం ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షలను అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పేద కుటుంబాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకునేందుకు వీలుగా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జనాభాలో సగభాగమైన మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలను అందజేస్తునామని, ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల రుణాలను అందించిన ఘనత ప్రజాపాలన ప్రభుత్వానిదని ఆయన తెలిపారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ ధ్యేయంగా మహిళలకు ఆర్టీసీ బస్సులను అద్దెకివ్వడం, సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా మహిళలకు తోడ్పాటు అందిస్తున్నట్లు గుర్తు చేశారు. రైతుల పక్షపాతిగా ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలతో ముందుకు వెళుతున్నదన్నారు. వసతి గృహాల్లో మెస్‌ చార్జీలను పెంచి నాణ్యమైన భోజనాన్ని అందించడంతోపాటు వసతి గృహాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. బహుజనుల రిజర్వేషన్‌ 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రానికి సమర్పించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఆమోదం తెలుపుతుందని డిప్యూటీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. గత పదేళ్ళలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఇప్పుడు దానికి నెలకు రూ.6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నట్లు తెలిపారు. అప్పులకు వాయిదాలు, వడ్డీలు కడుతూనే మరోవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే జిల్లాలో పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బి రోడ్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు కాగా పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టు అభివృద్ధికి రూ.90 కోట్లు మంజూరయ్యాయనీ తెలిపారు.
మంత్రి దుద్దిళ్ల మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలు పొందేందుకు రేషన్‌ కార్డు ఎంతగానో దోదపడుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి అర్హుడైన పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికి 75 వేల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. వికారాబాద్‌ నుండి తాండూరు వరకు రూ.63 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు నాంది పలికామని మంత్రి చెప్పారు. పట్నం మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందన్నారు. నియోజకవర్గంలో కొత్తగా 7,043 కార్డులు మంజూరు కాగా దీనితో 22,292 మందికి లబ్ధి చేకూరుతుంది. బషీరాబాద్‌లో 706, పెద్దెముల్‌లో 1939, తాండూరు మండలం, మున్సిపల్‌లో 3315, యాలాలలో 1083 కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ లింగ్యా నాయక్‌, తాండూర్‌ సబ్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కాల్వ సుజాత, డిసిసిబి చైర్మన్‌ సత్తయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లు, జిల్లా అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *