– కాంగ్రెస్ మోసాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రజలు
– ‘స్థానిక’ ఎన్నికల్లో ఆ పార్టీకి పరాభవం తప్పదు
– ఏ ఎన్నికలు వచ్చినా గెలిచి తీరుతాం
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ప్రదీప్ చౌదరితోపాటు పలువురు వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్సీ ఎల్.రమణ ఆధ్వర్యంలో సోమవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వాతావరణం చూస్తే గల్లీ ఎన్నికైనా, దిల్లీ ఎన్నికైనా బీఆర్‌ఎస్‌కు అనుకూలమేనన్న పరిస్థితి కనిపిస్తోందని ధీమా వ్యక్తంచేశారు. ప్రజలకు తామిచ్చిన ఎన్నికల హామీలను మర్చిపోయారని కాంగ్రెస్ పాలకులు భావిస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు ఇంకా మర్చిపోలేదని స్పష్టం చేశారు. రైతులు, మహిళలు, ఆటో డ్రైవర్లు, ప్రభుత్వోద్యోగులు, యువత, విద్యార్థులు, వివిధ సామాజిక వర్గాల వారందరికీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఘోరంగా మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గ్యారెంటీ కార్డులతో చేసిన గారడీలను గుర్తు చేసేందుకు మేం బాకీ కార్డులను తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఈ బాకీ కార్డులను ఇంటింటికీ తీసుకుపోతే అవే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రాలు అవుతాయన్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్కటంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టలేదని, గత 22 నెలలుగా నగరంలోని రోడ్లను కూడా ప్రభుత్వం నిర్వహించలేకపోతున్నదని మండిపడ్డారు. కనీసం మోరీలు శుభ్రపరిచే పరిస్థితి లేదు.. వీధి దీపాలు వెలిగించే పరిస్థితి లేదు.. మున్సిపల్ శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కొత్త నగరం కడతానని పోజులు కొడుతున్నాడు అని ఎద్దేవా చేశారు. మన హయాంలో చేసిన అభివృద్ధిని చూసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇక్కడి ప్రజలు మరోసారి మనకు వోటు వేసి గెలిపిస్తారన్న నమ్మకం ఉన్నదన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ సునామీలా విస్తరిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభయహస్తం భస్మాసుర హస్తమని తేలిపోయిందన్నారు. ఆ మేరకు రాష్ట్ర ప్రజల నుంచి స్పందన వస్తోందని, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలన్న స్పష్టమైన ఆలోచన కనిపిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎరువుల కోసం లైన్లలో నిలబడి కొట్లాడే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు గ్రామాల్లో ఆగ్రహావేశాలతో ఉన్నారని, మహిళలకు వాగ్దానం చేసిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ చేసిన మోసంపై ఆగ్రహం వ్యక్తమవుతోందని వివరించారు. రూ.4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పి వృద్ధులను మోసం చేసిందన్నారు. యువతకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యార్థులు, విద్యార్థినులకు స్కూటీలు అని చెప్పి మాటతప్పారా లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే రేవంత్‌రెడ్డి మాత్రం రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నడు అని విమర్శించారు. ఒకప్పుడు తెలుగువాడు దేశంలో ఉన్నాడని ఎన్టీఆర్ నిరూపిస్తే దేశంలో తెలంగాణవారు ఉన్నారని కేసీఆర్ నిరూపించారన్నారు. సాధించిన రాష్ట్రాన్ని దశాబ్దానికిపైగా అద్భుతమైన పాలనతో దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారని కేటీఆర్ చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





