– ఆ స్థానాన్ని నిలిపే బాధ్యత మీదే
– క్రమశిక్షణ అంటే సంసిద్ధత
– ఈ బ్యాచ్‌లో 38 మంది మహిళా అధికారులు
– ఇది అతిపెద్ద ప్రొబెషనరీ డీఎస్పీల బ్యాచ్
– డి.జి.పి. శివధర్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6: దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖ ప్రథమ స్థానంలో ఉందని, ఆ స్థాయిని నిలుపుకోవలసిన బాధ్యత ప్రొబేషనరీ డీఎస్పీల పైన ఉందని డీజీపీ బి.శివధర్ రెడ్డి అన్నారు. ఆర్బీవీఆర్‌ఆర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో గురువారం జరిగిన ప్రొబేషనరీ డీఎస్పీల శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్ట్, టీజీ సీఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్, ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, శాంతిభద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్, పోలీస్ కమిషనర్లు వి.సి.సజ్జనార్ (హైదరాబాద్), సుధీర్ బాబు(రాచకొండ), అవినాష్ మహంతి(సైబరాబాద్) తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే అగ్రగామిగా నిలిచిన తెలంగాణ పోలీస్ కుటుంబంలోకి అడుగుపెడుతున్న 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీ లతో కూడుకున్న అతి పెద్ద బ్యాచ్ ఇదేనని వెల్లడించారు. రానున్న పది నెలల శిక్షణ కాలం మీ నాయకత్వ పయనానికి అకాడమీ పునాది వేస్తుందని, ఈ అకాడమీ వాతావరణం మీలో క్రమశిక్షణ, సమయపాలన, దృక్పథంలో మార్పు తీసుకొస్తుందని పేర్కొన్నారు. పోలీస్ అధికారి కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాక దాని ఆత్మను అర్థం చేసుకోవాలని, నిష్పాక్షికత, ఓర్పు, సహానుభూతి వంటి విలువలే ఒక అధికారిని ఉత్తమంగా తీర్చిదిద్దుతాయని తెలిపారు. ప్రజలు మిమ్మల్ని అధికారులుగా కాదు.. న్యాయ ప్రతినిధులుగా చూస్తారని చెప్పారు. శిక్షణ కఠినమైనదే అయినా ప్రతి క్రమశిక్షణా చర్యలో ఒక అర్థం ఉందని, వ్యాయామం, సమష్టి కృషి ఇవన్నీ మీలో ఆత్మనిగ్రహం పెంచుతాయని వివరించారు. క్రమశిక్షణ అంటే శిక్ష కాదు.. సంసిద్ధత అని స్పష్టం చేశారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సీఐ సెల్, టిజీసీఎస్‌బీ, ఈగిల్ వంటి ప్రత్యేక సంస్థల ద్వారా తెలంగాణ పోలీస్ ఆధునిక పోలీసింగ్‌లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని, కమాండ్ కంట్రోల్ సెంటర్, షీ టీమ్స్, భరోసా సెంటర్స్, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నాలకు నిదర్శనాలని తెలిపారు. ఈ బ్యాచ్‌లో 38 మంది మహిళా అధికారులు ఉండటం గర్వకారణమని, రాష్ట్ర పోలీస్ భవిష్యత్తు మీరే అని అన్నారు. గౌరవం, సమానత్వం ఇక్కడి నుంచే ప్రారంభమవ్వాలని సూచించారు. నాయకత్వం అధికారంతో ప్రారంభమవదని, మీ ప్రవర్తన, నిజాయతీ, సహానుభూతి, సహచరుల పట్ల సానుకూలత ఇవే నిజమైన నాయకత్వ లక్షణాలని అన్నారు. ఇతరులను నడిపించాలంటే ముందుగా సేవ నేర్చుకోవాలని సూచించారు. ప్రజలు తమ పోలీసులపై అపార విశ్వాసం కలిగి ఉన్నారని, ఆ విశ్వాసం మనం సంపాదించుకున్నదని, ‘సేవతో గౌరవం పొందడం’ మన నినాదమని తెలిపారు. యూనిఫాం ధరించే ప్రతిసారీ ఆ విలువలు మీ ప్రవర్తనలో ప్రతిఫలించాలన్నారు. ఎవరూ చూడని వేళల్లో కూడా సత్యనిష్ఠగా ఉండాలని, పౌరుడి భావనను అర్థం చేసుకోవాలని, పనిలో ప్రావీణ్యం సాధించాలని తెలిపారు. పోలీస్ అధికారికి నిజమైన అధికారం యూనిఫాం మీద ఉన్న నక్షత్రాల వల్ల రాదనీ, ప్రజల కళ్లలో కనిపించే విశ్వాసం వల్ల వస్తుందని చెప్పారు. భద్రత, గౌరవం, న్యాయం, వృత్తి నైపుణ్యతకు ప్రతీకలుగా నిలవాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణతో గౌరవం, సత్యనిష్ఠతో నాయకత్వం, కరుణతో రక్షణ కల్పించేలా శిక్షణ పొందాలన్నారు. అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్ట్ మాట్లాడుతూ పది నెలలపాటు జరగనున్న శిక్షణ కార్యక్రమానికి సంసిద్ధులై ఉండాలన్నారు. మొదటి దశలో 42 వారాలపాటు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సిలబస్ కాపీలను డీజీపీ ఆవిష్కరించారు. ఐజీపీలు ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఎం .రమేష్, రమేష్ నాయుడు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్లు ఎన్.వెంకటేశ్వర్లు, మురళీధర్, జి.కవిత తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



