– దీనికి సంబంధించిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలి
– ఈత, తాటి కల్లు అమ్మకాలతో గీత కార్మికులకు ఉపాధి
– అధికారులను ఆదేశించిన మంత్రి జూపల్లి కృష్ణరావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: గంజాయి, డ్రగ్స్, నాటుసారా, ఎన్‌డీపీఎల్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు అధికారులను ఆదేశించారు. అబ్కారీ భవన్‌లో అబ్కారీ, ఎన్‌ఫొర్స్‌మెంట్, ఎస్టీఎఫ్ అండ్ డీటీఎఫ్, ఎన్‌ఫొర్స్‌మెంట్ అధికారుల పనితీరుపై మంత్రి శనివారం సమీక్షించారు. అక్రమ, కల్తీ మద్యం, కల్తీ కల్లు, డ్రగ్స్, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల విక్రయం, రవాణా, వినియోగం, నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్, చర్లపల్లి ప్యాక్టరీలో డ్రగ్స్ ముడి సరకు తయారీ, ఎన్డీపీఎస్ కేసుల పురోగతి, శిక్షల నిష్పత్తి, పాత నేరస్తుల, నిందితులపై నిఘా, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో అక్రమ మద్యం, గంజాయి తదితర మాదక ద్రవ్యాల సరఫరా, వాడకంపై ఉక్కుపాదం మోపాలని ఆయా విభాగాల అధికారులకు స్పష్టం చేశారు. ఇందుకు సరిహద్దు రాష్ట్రాల అధికారులతో సమన్వయంతోపాటు వీటితో సంబంధం ఉన్న కింగ్ పిన్‌లను గుర్తించి వారిని పీడీ యాక్టు కింద అరెస్టు చేయాలని ఆదేశించారు. ప్ర్రజల ప్రాణాలు తీసే ఎలాంటి మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో కనిపించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. నిఘా, విస్తృత తనిఖీలను చేపట్టాల్సిన అవసరం ఉందని, మరింత అప్రమత్తతో పని చేయాలని దిశానిర్ధేశం చేశారు. సరిహద్దు రాష్ట్రాల చెక్‌పోస్టుల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలని చెప్పారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయధాలు అప్పగించే అంశంలో నిబంధనలు ఏం చెబుతున్నాయి.. దీనికి ఉన్న అడ్డంకులు ఏమిటి.. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆయుధాలు అప్పగించారా.. దీని కోసం ఆ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. కేసులు నమోదు చేయడమేకాక నమోదైన కేసుల్లో ఎంతమంది నిందితులకు శిక్షలు పడుతున్నాయి అని ఆరా తీశారు. చర్లపల్లిలోని ఓ ప్యాకర్టీలో డ్రగ్స్ ముడిసరకు తయారీ కేసులో పురోగతి, ఎక్సైజ్ శాఖ తనిఖీ, బయటపడ్డ అంశాలపై ఇచ్చిన నివేదిక గురించి మంత్రి ఆరా తీశారు. మహారాష్ట్ర దర్యాప్తు సంస్థ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్టులో ఏముందని అడిగారు. చర్లపల్లి వంటి ఘటనల వల్ల మన విశ్వనీయతను కోల్పేయే ప్రమాదం ఉందని, ఇలాంటివి పునరావృతం కాకుండా నిఘాను మరింత పటిష్టం చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో విస్తృత సోదాలు నిర్వహించాలని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గోవాలో పెన్నీ, మధ్యప్రదేశ్‌లో ఇప్ప సారా (మహూవా) వంటి సంప్రదాయ మద్యాన్ని బ్రాండిరగ్ చేసి విక్రయిస్తున్నారని, అదే తరహాలో తెలంగాణలో ఈత, తాటి కల్లును కూడా టాడి నేచురల్ బ్రూవరీ నెలకొల్పి బాట్లింగ్ చేసి విక్రయించే యూనిట్లను నెలకొల్పడం వల్ల గీత కార్మికులకు ఉపాధితోపాటు ఆదాయం పెరుగుతుందని, కల్తీ కల్లును కూడా నివారించవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. ఫంక్షన్ హాల్స్, రిసార్టు, ఫాంహౌస్‌ల్లో జరిగే పార్టీల్లో నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం వినియోగంపై దృష్టి సారించాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక నిఘా పెట్టాలని, ఎక్సైజ్ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకుని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారికి సహకరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, కమిషనర్ సి.హరికిరణ్, ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసీం, అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషీ, అన్ని జిల్లాల డిప్యూటి కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎన్‌ఫొర్స్‌మెంట్, ఎస్టీఎఫ్, డీటీిఎఫ్ టీమ్స్ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





