క‌ళాశాల హాస్ట‌ల్‌లో డ్ర‌గ్స్ వినియోగం

– ఓ విద్యార్థిపై డ్ర‌గ్స్ తీసుకున్న విద్యార్థుల దాడి
– హాస్పిట‌ల్‌లో రెండు రోజులుగా చికిత్స‌
– అకాడమీ పేరుతో కళాశాల నిర్వహణ
– బ‌య‌ట‌పెడితే హాల్‌టిక్కెట్ ఇవ్వం
– బెదిరిస్తున్న క‌ళాశాల యాజ‌మాన్యం

ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: ఇంటర్  కళాశాల నిర్వహిస్తే అనుమతి కావాలని దొడ్డి దారిన అకాడమీ పేరుతో ఓ ఇంటర్ వసతి గృహ కళాశాల నిర్వహిస్తున్నారు. అక్కడ జరిగిన ఓ సంఘటన కళాశాల నిర్వహణ తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతం అనుకుంటే పొరబడ్డట్టే. ఇది ఖమ్మం నగరంలో కలెక్టరెట్ కు కూతవేటు దూరంలో ఉన్న ఓ కార్పొరేట్ కాలేజీలో జ‌రిగిన దారుణ‌మిది. స్థానికులు, బాధితుల కథనం మేరకు కళాశాల హాస్టల్‌లో డ్రగ్స్ మత్తులో ఉన్న ఇద్దరు ఇంటర్ విద్యార్థులు తోటి విద్యార్థిపై విచక్షణా రహితంగా దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో మామిడాల విశాల్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడి రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మూడు రోజుల క్రితం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు డ్రగ్స్ తీసుకుని మత్తులో విచక్షణ కోల్పోయి విశాల్‌పై పిడిగుద్దులతో దాడి చేసినట్లు సమాచారం. అడ్డుకునేందుకు యత్నించిన ఇతర విద్యార్థులపై కూడా దాడికి పాల్పడటంతో హాస్టల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశాల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నప్పటికీ, అతని ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దారుణ‌మేమంటే దాడి జరుగుతున్న సమయంలో హాస్టల్ వార్డెన్, సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో లేరు. దాడిని రహస్యంగా వీడియో తీసిన మరో విద్యార్థి తన తల్లిదండ్రులకు పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరుసటి రోజు ఘటన గురించి తల్లిదండ్రులు యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో ఇలాంటివి కాలేజీలో సాధారణంగా జరుగుతూనే ఉంటాయని కొట్టిపడేసిందని విద్యార్థి తల్లిదండ్రులు వాపోతున్నారు. అంతేకాక కొట్టుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి ఏదైనా ఉంటే మీరుమీరు బయట చూసుకోండి.. కళాశాలకు పూయకండి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడటంతోపాటు, త‌మ‌ను కూర్చోబెట్టి విషయం బయటకు పొక్కితే వారంలో జరిగే పరీక్షలకు హాల్ టికెట్ ఇవ్వమని బెదిరింపులకు దిగినట్లు గాయపడిన విద్యార్థి కుటుంబ సభ్యులు చెపుతున్నట్లు తెలుస్తున్న‌ది. విద్యార్థులు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికైనా కాలేజీలో జరిగిన అమానుష సంఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *