యువతకు చీడగా మారిన డ్రగ్స్ దందా!!

 ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (25) మరణం తెలంగాణలో గంజాయి స్మగ్లర్ల అరాచకాలు ఏస్థాయిలో ఉన్నాయో తెలియజెబుతోంది. జనవరి 23న ఆమెపై దాడి జరగ్గా, హాస్పిటల్‌లో మరణంతో పోరాడి జనవరి 31న తుదిశ్వాస విడవడం విషాదం. జనవరి 23 రాత్రి గంజాయి అక్రమ రవాణాపై సమాచారమందుకున్న నిజామాబాద్‌కు చెందిన  ఎక్సైజ్ బృందం మాధవనగర్ ప్రాంతంలో వాహనాల తనిఖీని మొదలుపెట్టింది. ఈ సందర్భం  అనుమానాస్పద కారును  ఎక్సైజ్ టీమ్ అడ్డగించగా, అందులోని స్మగ్లర్లు మొదట పారిపోవడానికి యత్నించినప్పుడు కానిస్టేబుల్ సౌమ్య వారి కారుకు ఎదురుగ్గా నిలబడ్డారు. దీంతో వారు వేగంగా ఆమె పైకి కారును పోనివ్వడంతో కిందపడిన ఆమెను కారు కొంతదూరం ఈడ్చుకెళ్లింది. స్మగ్లర్లు కారును మళ్లీ రివర్స్ చేసినప్పుడు అది కొంతదూరం వెళ్లి ఒక కరెంట్‌పోల్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. కానీ కారు అడుగున ఉన్న  ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో తక్షణం హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్  తరలించారు.

కారు అడుగున పడటం, ఈడ్చుకుపోవడంతో ఆమె శరీరంలోని అంతర్భాగ అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో చికిత్స జరుపుతూనే ఒక కిడ్నీని కూడా తొలగించినా ఫలితంగా మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం ఆమె స్వగ్రామం మోస్రాలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. కారులో ప్రయాణిస్తున్న స్మగ్లర్లలో కనీసం ముగ్గురు నిర్మల్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. వీరిలో ఇద్దరిపేర్లు వరుసగా సైఫుద్దీన్, సయ్యద్ సోహెల్ మార్టిన్. వీరి వద్ద 2.5 కిలోల గంజాయిని పట్టుకున్నారు. సంఘటనను ముఖ్యమంత్రి రేవంత్ తీవ్రంగా పరిగణించి ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం, సౌమ్య కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం ప్రకటించడం అనంతర పరిణామాలు. అంతేకాదు ఆమె మిగిలిన సర్వీస్ కాలం మొత్తం, జీతం మొత్తాన్ని పింఛనుగా చెల్లించాలని కూడా ఆయన ఆదేశాలు జారీచేశారు. ఈ సంఘటన నేపథ్యంలో  ఎక్సైజ్ సిబ్బందికి కూడా ఆయుధాలు ఇవ్వాలన్న అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.

చాలాకాలంగా గంజాయి వంటి మత్తుపదార్థాలు విచ్చలవిడిగా లభ్యమ వుతుండటంతో పాఠశాల స్థాయినుంచి, కళాశాల స్థాయి వరకు బాలురు, యువకులు వీటికి అలవాటుపడి తమ జీవితాలను పాడుచేసుకోవడమే కాకుండా, తల్లి దండ్రులకు మానసిక క్షోభను మిగులుస్తున్నారు. ప్రస్తుతం చిన్న పిల్లలనుంచి యువతవరకు సోషల్ మీడియాతో పాటు, మత్తుపదార్థాలకు బానిసలు కావడం పెద్ద సామాజిక రుగ్మతగా పరిణమించింది. ముఖ్యంగా జ్ఞాపకశక్తి నశించడం,దృష్టి కేంద్రీకరించలేకపోవడం, బడులకు ఎగ్గొట్టడం వంటి అవలక్షణాలు మత్తుపదార్థాలకు అలవాటుపడిన వారిలో సాధారణంగా కనిపిస్తాయి. ఇంకా సైజో ఫెరినియా, బైపోలార్ డిజార్డర్, మానిక్ డిప్రెషన్ వంటి మనో రుగ్మతలకు వీరు గురవుతుండటంతో చికిత్స అందించడం పెద్ద సమస్యగా మారింది. అబద్ధాలాడటం, తమకు కావలసిన మత్తుపదార్థం కొనుగోలుకు అవసరమైతే దొంగతనాలకు పాల్పడటం కూడా చూస్తుంటాం. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పాతనగరంలోని కొన్ని పాఠశాలలతో పాటు ఇతర ప్రాంతాలలోని కొని బడుల్లోని పిల్లలు తేలిగ్గా మత్తుమందులకు బానిసలవుతున్నారన్న దానికంటే, వీరిని కొందరు దుర్మార్గులు ఈ ఊబిలోకి దించుతున్నారనడం సమంజసం.

 తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ)తో పాటు ఇతర సంస్థలు ఇచ్చిన తాజా నివేదిక, ఈ మత్తుపదార్థాల వాడకం ఏవిధంగా ప్రమాకర రీతిలో పెరుగుతున్నదీ వెల్లడిస్తోంది. దీని ప్రకారం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ పదార్థాల (ఎన్‌డీపీఎస్) వాడకం 2017లో కేవలం 381 నమోదు కాగా 2024 నాటికి 2181కి చేరుకుంది. అంటే 470% పెరుగుదల! మత్తుమందులు తీసుకుంటున్న 2100 మంది యువకులను గుర్తించగా వీరిలో 450 మంది (21%) విద్యార్థులు! తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే జీహెచ్‌ఎంసీ, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో మత్తుమందుల వినియోగం రెండింతలు అధికంగా ఉన్నట్లు తేలింది. గత ఏడాది కేవలం జనవరి నెలలోనే అధికార్లు 183 ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు చేసి 561 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారంటే, దీని వాడకం ఎంత తీవ్రస్థాయిలో కొనసాగుతుందో తేలి గ్గా అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది మొత్తం మీద హైదరాబాద్ పోలీసులు, ఇతర అధికార్లు నగరంలో 6వేల కిలోల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకోగా, ఇందులో గంజాయి 3243 కిలోలు!! 2024లో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.210.49 కోట్ల విలువైన మత్తు పదార్థాలను ధ్వంసం చేసింది!

నషా ముక్త్ అభియాన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మత్తుమందుల వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. డ్రగ్స్ అక్రమ రవాణాను, గంజాయి సాగును అరికట్టేందుకు ఇప్పటివరకు అమల్లో ఉన్న  టీజీఏఎన్‌బీని, ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగిల్)గా రూపుమార్చింది. పాఠశాలలు, కళాశాలల చుట్టుపక్కల గంజాయి అమ్మకా లు జరిగినట్లయితే, ఆయా విద్యాసంస్థలను అందుకు బాధ్యులను చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అంతేకాదు ఫస్ట్‌లైన్ ఆఫ్ డిఫెన్స్ గా పాఠశాలల్లో 22వేల ప్రహారీ క్లబ్‌లతో పాటు కళాశాలల్లో 1405 యాంటీ డ్రగ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతేకాదు అధికార్ల బృందా లు విద్యాసంస్థల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు పరీక్షలు చేస్తున్నారు.

ఇన్ని చేస్తున్నా డ్రగ్స్ దందా ఆగడం లేదు. హైదరాబాద్ డ్రగ్ స్మగ్లర్లకు ఒక ట్రాన్సిట్ హబ్‌గా మారిపోయింది. ఆంధ్ర-ఒడిషా (ఏఓబీ) సరిహద్దు ప్రాంతం, మల్కాన్‌గిరి (ఒడిషా)ల నుంచి తమిళనాడు, మహారాష్ట్రలకు, తెలంగాణ మీదుగా డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోంది. ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ, ఎకాస్టసీ వంటి సింథటిక్ డ్రగ్‌లు, గోవా, మహారాష్ట్ర, కర్ణాటకలనుంచి సరఫరా అవుతుండగా, నల్లమందుకు ప్రధాన వనరుగా రాజస్థాన్ కొనసాగుతోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తరచుగా అధికార్లు పట్టుకునేది “హైడ్రోపోనిక్ గంజాయి”.  ఈ ఏడాది తాజాగా ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల నుంచి రూ.14 కోట్ల విలువైన డ్రగ్స్‌ను అధికార్లు పట్టుకున్నారు.

డార్క్ వెబ్, ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్ యాప్‌ల కారణంగా డ్రగ్స్ సరఫరాదార్లకు, వినియోగదా ర్లకు మధ్య లింక్‌ను కనుక్కోవడం ఇంటెలిజెన్స్ అధికార్లకు కష్టంగా మారింది.  వీటికి తోడు స్మగ్లర్లు డ్రగ్ సరఫరాకు కొత్త విధానాలను ఎంచుకుంటుండటం అధికార్లను ఆశ్చర్యపరుస్తోంది. నైజీరియన్ సిండికేట్లు మహిళల బ్యాంకు ఖాతాలను “మ్యూల్ అకౌంట్స్”గా ఉపయోగిస్తుండటాన్ని అధికార్లు గుర్తించడం తాజా పరిణామం. ఒకరిని అరెస్ట్ చేసినా తక్షణమే ఆ స్థానంలోకి మరొకరు వస్తుండటం విశేషం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ దందాలో ఎక్కువ లాభాలుండటమే ఎక్కువమంది దీనివైపుకు మరలడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రభుత్వాలు ఎన్ని నినాదాలు ఇచ్చిన ఆచరణలో నిష్క్రియాతత్వం స్పష్టంగా కనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *