మత్తు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యం

– మంచి భవిష్యత్తు కోసం వ్యసనాలకు దూరంగా ఉండండి
– మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: మత్తు పదార్థాల బారి నుండి పూర్తిగా విముక్తి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌ సాధికారత శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. గాంధీ మెడికల్‌ కళాశాల స్వామి వివేకానంద ఆడిటోరియంలో రాష్ట దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల సాధకారిత శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన నషాముక్త్‌ భారత్‌ అభియాన్‌ 5వ వార్షికోత్సవంలో మంత్రి అడ్లూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను చదువు, ఉద్యోగావకాశాలు, వ్యక్తిత్వ వికాసంలో నిలబెట్టడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా ఉందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో డ్రగ్‌ సరఫరా మార్గాలను పూర్తిగా నిర్మిలించడానికి ప్రవేశపెట్టిన ఈగల్‌ స్పెషల్‌ యూనిట్‌ కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. రియల్‌ టైమ్‌ ఇంటెలిజెన్స్‌, డేటా విశ్లేషణ, వేగవంతమైన ఆపరేషన్లతో ఈ వ్యవస్థ రాష్ట్ర పోలీసింగ్‌ విధానాన్ని కొత్త దిశలో నడిపిస్తోందన్నారు. మత్తు వ్యసనం వ్యక్తిగత అలవాటు కాదు.. ఇది కుటుంబాలను కూల్చివేసే ఒక అగ్ని కీల అని పేర్కొన్నారు. యువత రక్షణ తెలంగాణ భవిష్యత్తు రక్షణేనని ముఖ్యమంత్రి అభిప్రాయమని అన్నారు. యువత కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, కళాశాలల్లో కౌన్సెలింగ్‌ సేవలు, స్పోర్ట్స్‌-కల్చరల్‌ ఈవెంట్లు, డ్రగ్‌ ఫ్రీ క్యాంపెయిన్‌లు, మారథాన్‌లు నిర్వహిస్తున్నందున సానుకూల వాతావరణం ఏర్పడుతోందని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి వర్గం భాగస్వామ్యం అవసరమని అన్నారు. డ్రగ్స్‌కు దూరంగా%ౌ% కెరీర్‌కు దగ్గరగా, విజయాలకు దగ్గరగా, భవిష్యత్తుకు దగ్గరగా’’ అనే నినాదాన్ని విద్యార్థి జీవన సూత్రంగా తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో సేవలందిస్తున్న వలంటీర్లను సన్మానించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన నాటక ప్రదర్శన, ఆటలు, పాటలు, మత్తు వ్యసనంపై అవగాహన కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. మత్తు నిరోధక చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఎంబీఏ కమిటీలు ఏర్పాటు చేసి పాఠశాలలు-కళాశాలల్లో క్లబ్‌లు స్థాపించామని మంత్రి వివరించారు. ఇప్పటివరకు 15,891 విద్యాసంస్థల్లో 7,018 కార్యక్రమాల ద్వారా 1.45 కోట్ల మందికి అవగాహన కల్పించామని చెప్పారు. ఇది దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్‌ అవగాహన కార్యక్రమమని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు. యువత పునరావాసానికి ప్రత్యేక చర్యలలో భాగంగా సైదాబాద్‌ అబ్జర్వేషన్‌ హోమ్‌లో పిల్లల కోసం డీ-అడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్టు, చర్లపల్లి, నిజామాబాద్‌, చంచల్గూడ, సంగారెడ్డిలో జైళ్లలో ప్రత్యేక చికిత్సా సేవలు ప్రారంభించామని చెప్పారు. పది జిల్లాల్లో ఎన్జీవోలతో కలిసి పునరావాస కేంద్రాలు, త్వరలో 12 జిల్లా హాస్పిటల్స్‌లో కొత్త చికిత్సా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. గాంధీ మెడికల్‌ కాలేజీలో నిర్వహించిన డీ-అడిక్షన్‌ మాస్‌ ప్లెడ్జ్‌లో మంత్రి అడ్లూరి వైద్య విద్యార్థుల చేత మాదకద్రవ్యాల నిరోధక- 2025 ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ డిపార్ట్‌మెంట్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, టీజీ ఈగల్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య, హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన దాసరి, సీనియర్‌ సిటిజన్‌ అండ్‌ ట్రాన్స్‌జెండర్‌ విభాగం డైరెక్టర్‌ శైలజ, హైదరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ జాయింట్‌ సెక్రటరీ శ్రీకాంత్‌, గాంధీ హాస్పిటల్‌ సూపరిండెంటెంట్‌ డాక్టర్‌ వాణి, గాంధీ మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఇందిరా, యాంటీ నార్కోటిక్‌ బ్యూరో ఎస్పీ సీతారాం, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page