– ముందు చూపుతో ప్రణాళికలు రూపొందించాలి
– గ్రామీణ తాగునీటి సరఫరాపై సమీక్షలో మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6: సమస్య తలెత్తిన తర్వాత స్పందించడం కాదు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో గ్రామీణ తాగునీటి సరఫరాపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ముందుచూపుతో ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పంపు సెట్లు పాడైనచోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని, చిన్న లోపాల వల్ల పెద్ద సమస్యలు తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా వేసవిలో ఎక్కడా తాగునీటి కొరత రాకుండా అన్ని స్థాయిల్లో సమన్వయంతో పనిచేయాలన్నారు.
నీటి నిల్వలను అంచనా వేస్తూ ప్రణాళికలు రూపొందించాలి
గత ఏడాది పకడ్బందీ ప్రణాళికలతో రాష్ట్రంలో తాగునీటి సమస్యలు రాకుండా నియంత్రించగలిగామని మంత్రి గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా రిజర్వాయర్లలో తగినంత నీటి లభ్యత ఉందని, అయితే ఎప్పటికప్పుడు నీటి నిల్వలను అంచనా వేస్తూ పరిస్థితులకనుగుణంగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదే సమయంలో కొన్నిచోట్ల మిషన్ భగీరథ సిబ్బంది స్వలాభం కోసం అవసరం లేకపోయినా కొత్త బోర్లు వేయాలని ప్రోత్సహిస్తున్నారని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరం లేని కొత్త బోర్ల వల్ల డబ్బు, శ్రమ రెండూ వృథా అవుతున్నాయంటూ దీనిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. మేడారం మహా జాతర దృష్ట్యా తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. జాతర సందర్భంగా ఎలాంటి నీటి సమస్యలు తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులను ప్రత్యేకంగా నియమిస్తామని చెప్పారు. ఈ నెల 10న మేడారంలో మిషన్ భగీరథ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని వెల్లడించారు. జాతర కాలంలో అంతరాయం లేకుండా తాగునీరు సరఫరా అయ్యేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. కాగా, మేడారం మహా జాతరకు ఆహ్వానిస్తూ మిషన్ భగీరథ సిబ్బంది తరపున ఈఎన్‌సీ కృపాకర్ రెడ్డికి మంత్రి సీతక్క ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్ రెడ్డి, సీఈలు, ఎస్‌ఈలు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



