– తామే ఏదో చేసినట్లు కొందరు నమ్మించారు
– నీళ్లు చల్లుకుంటే పాపాలు పోవు
– గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2, 3కి శంకుస్థాపన
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 1965లో మంజీరా నది నుంచి నగరానికి తాగు నీరు అందించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమని,2002లో కృష్ణా నదీ జలాలను మూడు దశల్లో నగరానికి తరలించి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదని వివరించారు. గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2, 3కి గండిపేట వద్ద ముఖ్యమంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జల మండలి ఆధ్వర్యంలో నిర్మించిన 16 జలాశయాలను ప్రారంభించారు. నియో పోలీస్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ తెచ్చిన గోదావరి జలాలను నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు కొందరు నమ్మించారని, నెత్తిమీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన వాళ్ల పాపాలు తొలగిపోవని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడిందని తెలిపారు. 1908లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి నిజాం ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలను వరదల నుంచి కాపాడిరదని, వందేళ్లకుపైగా ఈ నగరానికి తాగు నీరు అందుతున్నదంటే నిజాం సర్కార్ దూరదృష్టే కారణమని చెప్పారు. విషతుల్యమైన మూసీని ప్రక్షాళన చేస్తానని నల్లగొండ జిల్లా ప్రజలకు ఆనాడే మాట ఇచా.. 20 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలించి ఇందులో 16 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి కోసం వినియోగించబోతున్నామని, చెరువులను నింపుకుంటూ 4 టీఎంసీలను మూసీకి తరలించి మూసీని ప్రక్షాళన చేస్తామని వివరించారు. శ్రీపాద ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలిస్తున్నామని, ఆ సంగతి మరిచిపోయి కొందరు మల్లన్నసాగర్ అని మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. చేవెళ్లలో వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాసుల కక్కుర్తితో తలను తొలగించింది మీరు కాదా.. చేవెళ్ల, తాండూరు, పరిగికి సాగునీరందకపోవడానికి కారణం మీరు కాదా అని బీఆర్‌ఎస్ నేతలను నిలదీశారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల కట్టి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. గంగ, యమున, సబర్మతీ నదులు ప్రక్షాళన చేయొచ్చు.. కానీ మేం మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దా.. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేపట్టలేదు అని ప్రశ్నించారు.
ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం
అభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరుతున్నానని, తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను డిసెంబర్ 9న తెలంగాణ సమాజానికి అంకితం ఇవ్వబోతున్నామని, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తమ ప్రభుత్వం తిప్పికొడుతుందని సీఎం అన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంలో అందరూ కలిసిరండి అని పిలుపునిచ్చారు. ఇది ఇందిరమ్మ రాజ్యం.. పేదోళ్ల రాజ్యం.. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.
మహా నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: శ్రీధర్‌బాబు
హైదరాబాద్ మహా నగరాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని,. ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గోదావరి, కృష్ణా, మంజీరా జలాలను ఇక్కడికి తీసుకొచ్చిందని తెలిపారు. పెరుగుతున్న జనాభా అవసరాలకనుగుణంగా హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే మళ్లీ జంటనగర వాసులకు తాగునీటికి ఇబ్బంది కలగకుండా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. మార్పునకు ఇదే సంకేతమని ఆయన అన్నారు. భవిష్యత్ తరాల అవసరాలకనుగుణంగా రాబోయే రెండేళ్లలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేలా అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నామని, వాటిని పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు. భావితరాల కోసమే మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని, నగరవాసులకు అంతర్జాతీయ జీవన ప్రమాణాలను అందించాలన్నదే తమ సంకల్పమని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




