తాగు నీటి సమస్యలు తలెత్తొద్దు

– మిషన్ భగీరథపై సమీక్షలో మంత్రి సీతక్క ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: వేసవి కాలంలో తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో మిషన్ భగీరథ పనితీరుపై మంత్రి సీతక్క సచివాలయంలో విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా పరిస్థితి, నీటి నిల్వల స్థాయి, పంపిణీ వ్యవస్థపై సమగ్ర వివరాలను అధికారులు మంత్రి ముందు ఉంచారు. రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లు, సోర్స్ పాయింట్ల వద్ద తగిన నీటి నిల్వలు ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి కొరత తలెత్తే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ‘సమ్మర్ స్పెషల్ డ్రైవ’ విజయవంతంగా పూర్తి చేశామని, అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా అంతరాయం లేకుండా కొనసాగుతోందని తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు గ్రామస్థాయిలో మిషన్ భగీరథ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని వివరించారు. ముఖ్యంగా సర్పంచులతో నేరుగా సంప్రదింపులు జరుపుతూ రోజువారీ తాగునీటి సరఫరా పరిస్థితిని తెలుసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 శాతం మంది సర్పంచులతో మాట్లాడి ఫీడ్‌బ్యాక్ సేకరించామని, వారందరూ తాగునీటి సరఫరాపై సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఎక్కడైనా పైపులైన్ మరమ్మతులు లేదా ఇతర పనులు చేయాల్సి వస్తే గ్రామస్తులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అలాగే మిషన్ భగీరథ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాని గ్రామాలు, ముఖ్యంగా మారుమూల ఆదివాసీ గూడాల్లో తాగునీటి కోసం బావులు తవ్వాలనే ప్రజల అభ్యర్థనలు వస్తున్నాయని మంత్రి తెలిపారు. అలాంటి ప్రాంతాల్లో ప్రజల అవసరాలను గుర్తించి తక్షణమే బోర్లు, బావులు తవ్వే ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా కుంటలను తవ్వాలని సూచించారు. తద్వారా బుగ్గర బజానాలను పెంచుకోవచ్చని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రతి గ్రామానికి నిరంతర నీటి అందుబాటును కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్య దేవరాజన్, ఇంజినీర్-ఇన్-చీఫ్ కృపాకర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *