-గ్యాస్ కంపెనీలకు కేంద్రం ఆదేశం
-పెట్రో కంపెనీలతో కమిటీ ఏర్పాటు
-కృత్రిమ కొరత సృష్టిస్తే అత్యవసర చట్టం ప్రయోగం
-కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ అత్యవసర భేటీ
-పెట్రో, గ్యాస్ నిల్వలు, సరఫరాలపై సమీక్ష
న్యూదిల్లీ, మార్చి 10: దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ కొరత పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర పెట్రోలియం శాఖ రంగంలోకి దిగింది. గ్యాస్ ఉత్పత్తిని తక్షణమే పెంచాలని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఇంధన కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కనీసం 10శాతం గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని కేంద్రం ఆదేశించింది. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాల వల్ల సరఫరాలో ఏర్పడిన ఆటంకాలను అధిగమించి, దేశీయ అవసరాలకు తగినంత స్టాక్ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం సూచించింది. సామాన్య ప్రజలకు వంట గ్యాస్ ఇబ్బందులు కలగకుండా చూడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. ఇరాన్ యుద్ధం భారత్‌లో చమురు ఆందోళనలు రేకెత్తిస్తోంది. దేశ ప్రజలకు ఇంధన, గ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ కీలక భేటీ నిర్వహించారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో చర్చలు జరిపారు. ఎల్‌పీజీ ఉత్పత్తులు, సరఫరాపై సక్ష జరిపారు. ఇరాన్ యుద్ధం సామాన్యులపై ప్రభావం చూపకూడదని ప్రధాని మోదీ మంత్రులకు తెలిపారు. అలాగే యుద్ధంతో ఉత్పన్నమయ్యే అంతరాయాల గురించి చర్చించారని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మరోవైపు పరిశ్రమల నుంచి గ్యాస్‌ను మళ్లించడం ద్వారా ప్రజలకు గ్యాస్ కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఇరవై ఒక్క రోజుల తర్వాత బుకింగ్‌లు జరిగేవి, ఇప్పుడు25 రోజులకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలానే ఎల్పీజీ ఉత్పత్తిని 10 శాతం పెరిగిందని కేంద్ర వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ యుద్ధంతో హర్మూజ్ జలసంధి నుంచి నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్‌కు కృత్రిమ కొరత కలగకుండా కేంద్రం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రయోగించింది. బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను నియంత్రించే ఉద్దేశంతో పెట్రోలియం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో దాదాపు రెండున్నర లేదా మూడు రోజుల్లో వినియోగదారులకు గ్యాస్ సరఫరా జరిగేది, ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అదే సమయం పడుతుందని వర్గాలు తెలిపాయి. అన్ని శుద్ధి కర్మాగారాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి, దేశవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఎల్‌పీజీ కొరత లేదని, సరఫరాను స్థిరీకరించామని కేంద్ర ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా దేశంలో పలు హోటళ్లు, రెస్టారంట్లు మూతపడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల నేపథ్యంలో కేంద్రం నుంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి రిఫైనరీలు ఎల్‌పీజీ ఉత్పత్తిని 10శాతం మేర పెంచాయని పేర్కొన్నాయి. కృత్రిమ కొరతను నిరోధించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాయి. ఎల్‌పీజీ సరఫరా విషయంలో సమస్యలను అర్థం చేసుకునేందుకు చమురు మార్కెటింగ్ కంపెనీలు వివిధ రెస్టారంట్ అసోసియేషన్లతో మాట్లాడుతాయి. ఇందుకోసం ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఓ కమిటీ ఇప్పటికే ఏర్పాటైంది. హోటళ్లు, రెస్టారంట్ల అవసరాలకు తగ్గట్టుగా కమిటీ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే కొన్నిరోజుల వ్యవధిలోనే దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తి 10 శాతం మేర పెరిగింది. ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ కన్‌సైన్‌మెంట్ వివిధ వనరుల నుంచి వస్తోంది. కొత్త కన్‌సైన్‌మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో మనం గతంలో సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొన్నాం కానీ.. ఇప్పుడు అలాంటివి ఏ లేవు. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణకు ముందువలే భారత రిఫనరీలు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. మన ముడిచమురు దిగుమతుల్లో 70 శాతం హర్మూజ్ జలసంధి నుంచి కాకుండా ఇతర వనరుల నుంచి సమకూరుతున్నాయి. ఇక సంక్షోభం తర్వాత ఇతర దేశాల కంటే మనమే మెరుగ్గా మనం కోలుకుంటాం. అంతేగాకుండా శుద్ధిచేసిన చమురు ఎగుమతులను నియంత్రించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
హోటల్ పరిశ్రమకు గ్యాస్ అలభ్యత
న్యూదిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్, ఎరువుల దిగుమతులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా ఎల్పీజీ కొరత ఏర్పడింది. గ్యాస్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరను భారీగా పెంచేశాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లతో పాటు డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర పెరిగింది. డొమస్టిక్ సిలిండర్లపై 60 రూపాయలు.. కమర్షియల్ సిలిండర్లపై 115 రూపాయలు పెరిగింది. అంతేకాదు.. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా నిలిచిపోయింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవటంతో బెంగళూరు, చెన్నై, ముంబైలలోని హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నగరాల్లోని దాదాపు 20 శాతం హోటళ్లు మూతపడ్డాయి. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా ముంబయి లో 20శాతం హోటళ్లు, రెస్టారంట్లు మూతపడ్డాయని హెటల్ హోటల్ అండ్ రెస్టారంట్ అసోసియేషన్ మంగళవారం వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రెండు రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూతపడతాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. ’ది బెంగళూరు హోటల్స్ అసోసియేషన్’ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో.. ’గ్యాస్ సరఫరా నిలిచిపోవటంతో.. హోటల్స్ మూతపడనున్నాయి. భోజనం కోసం హోటల్స్‌పై ఆధారపడిన సాధారణ ప్రజలు, విద్యార్థులు, మెడికల్ ప్రొఫెషనల్స్ ఇబ్బందులు పడకతప్పదు. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వొచ్చే వరకు మా హోటల్ ఇండస్టీ ఇబ్బందులు పడక తప్పదు. ఈ విషయంలో కేంద్రం త్వరగా సరైన చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొంది. చెన్నై హోటల్స్ అసోసియేషన్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ’పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్ సిలిండర్ల సప్లైని పూర్తిగా ఆపేశారు. స్టాక్ లేదని అంటున్నారు. దీని ఫలితంగా చాలా హోటళ్లు బలవంతంగా మూసేయాల్సి వస్తోంది’ అని పేర్కొంది. ’ది నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై స్పందించింది. ఈ మేరకు సోమవారం ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ’రెస్టారెంట్ ఇండస్ట్రీకి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఎటువంటి నిషేధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. సప్లయర్లు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు. ఇది రెస్టారెంట్ ఇండస్టీప్రై, ఆహార సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది’ అని రాసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కలుగజేసుకోవాలని కోరింది. ఒక్కో వాణిజ్య సిలిండర్‌ను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బ్లాక్ విక్రయాలను అరికట్టేందుకు సిలిండర్ల బుకింగ్ వ్యవధిని ప్రస్తుతమున్న 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. అలాగే చమురు సంస్థలపై నిత్యావసర సరకుల చట్టాన్ని ప్రయోగించింది
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




