మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

– నలుగురు సిబ్బంది సస్పెన్షన్

మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మార్చి 3: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్‌లో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై ప్రభుత్వం స్పందించింది. దీనిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం విచారణ జరిపింది. అనంతరం బాధ్యులైన నలుగురిని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు. జడ్చర్ల మండలం నాగసాలకు చెందిన భీమేశ్ (32) శ‌నివారం ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. రెండు రోజుల తర్వాత మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించారు. విషయం తెలిసి బంధువులు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో మార్చురీలో కుక్కల శబ్దం రావడంతో దగ్గరికి వెళ్లి చూసిన బంధువులకు ఓ కుక్క మృతదేహాన్ని పీక్కుతినడం కనిపించింది. కుటుంబీకులు వీడియో తీసి సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఇంత ఘోరమైన పరిస్థితికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతదేహాలను భద్రపరచడానికి ఫ్రీజర్లు లేకపోవడం, సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలిసింది.

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: మాజీ మంత్రి

జడ్చర్ల హాస్పిటల్‌లో జరిగిన సంఘటన దారుణమని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. గతంలో ఎప్ప్పుడూ చూడని విధంగా మార్చురీలో మృతదేహాన్ని కుక్క పీక్కుతినడం వైద్య అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. హాస్పిటల్‌లో అడుగడుగునా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మార్చురీ, వంద పడకల హాస్పిటల్, నూతనంగా నిర్మించిన మార్చురీ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్చురీలో ఫ్రీజర్లు లేవని, మృతదేహాలను స్ట్రెచర్‌పై కాక నేలపై పెట్టడం దురదృష్టకరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్స్‌ను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో హాస్పిటళ్లు దీనావస్థకు చేరుకుంటున్నాయని, వసతులు లేవు, మందులు లేవని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హాస్పిటళ్లను అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని, కొత్త హాస్పిటల్స్ నిర్మించామని, పేదలకు మెరుగైన వైద్యం అందించామని వివ‌రించారు. పాత రోజులు తెస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిజం చేసిందన్నారు. కొత్త హాస్పిటల్‌లో 2024 జూన్‌లోనే మార్చురీ భవనం పూర్తి అయినా వాడుకోలేదన్నారు. మార్చురీని ఎందుకు మార్చలేదదంటూ పాత దాంట్లో ఫ్రీజర్, స్టెచ్రర్ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలన గాలికి వదిలేసిందని విమర్శించారు. ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని, జడ్చర్లలో స్థలాలు చాలా ఉన్నాయని, సీఎం సొంత జిల్లా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇన్‌చార్జిగా ఉన్న జిల్లాలో ఇంతటి దుస్థితి నెలకొనడం సిగ్గుచేటని అన్నారు. ప్రజలు సమస్యను వివరిస్తే వారిపైనే ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *