ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి..

– కేటీఆర్‌ స్ఫూర్తితో బోరబండ యువకుల ‘డాక్టర్‌ గార్డ్‌’ ఏర్పాటు
– వారి కోరిక మేరకు కార్యాలయాన్ని సందర్శించిన కేటీఆర్‌
– తెలంగాణ భవన్‌కు వాటర్‌ ప్రూఫింగ్‌ పనులు అప్పగింత
– యువతకు అండగా ఉంటామని భరోసా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: ఉద్యోగాలు అడిగే వారుగా కాదు.. ఉద్యోగాలు ఇచ్చే వారుగా ఉండాలి అని కేటీఆర్‌ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొందిన బోరబండకు చెందిన తొమ్మిదిమంది యువకులు కలిసి డాక్టర్‌ గార్డ్‌ పేరుతో వాటర్‌ప్రూఫ్‌ సొల్యూషన్స్‌ కంపెనీని ప్రారంభించారు. యువ మిత్రులు ప్రారంభించిన కంపెనీని వారి కోరిక మేరకు కేటీఆర్‌ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా యువకులతో మాట్లాడిన ఆయన ఉద్యోగాలు అడగడం కాకుండా పదిమందికి ఉపాధి కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో ఈ కంపెనీని ప్రారంభించడం అభినందనీయమన్నారు. జేఎన్‌టీయూ ప్రసంగంలో కేటీఆర్‌ చెప్పిన మాటల స్ఫూర్తితోనే కంపెనీని ఏర్పాటు చేసినట్లు ‘డాక్టర్‌ గార్డ్‌’ బృందం తెలిపింది. పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే అయినప్పటికీ తమ కాళ్లపై తాము నిలబడాలనే లక్ష్యంతో కంపెనీని స్థాపించినట్లు యువకులు తెలిపారు. ప్రస్తుతం తమ కంపెనీలో 30 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, రానున్న ఏడాదిలోగా ఈ సంఖ్యను వెయ్యికిపైగా తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తున్నామని వారు కేటీఆర్‌కు వివరించారు. వాటర్‌ప్రూఫ్‌ సొల్యూషన్స్‌లో ప్రస్తుతం ఉన్న పద్ధతులకు మరింత ఆధునికతను, సాంకేతికతను జోడిరచినట్లు యువకులు తెలిపారు.

కంపెనీకి మొదటి కస్టమర్‌ కేటీఆర్‌

కంపెనీని సందర్శించిన అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. మీరు ఇచ్చిన స్ఫూర్తితోనే తాము కంపెనీని ప్రారంభించామని, తమ చిన్నపాటి కార్యాలయాన్ని సందర్శించి మరింత స్ఫూర్తినివ్వాలని ఈ బృందంలోని ఇమ్రోజ్‌ సోషల్‌ మీడియా ద్వారా మెసేజ్‌ పంపి కోరిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు. యువకుల ప్రయత్నం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ వారి కంపెనీకి మొదటి కస్టమర్‌గా తానే ఉంటానని సంసిద్ధత తెలిపి తమ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు సంబంధించిన వాటర్‌ప్రూఫ్‌ పనులను ఆ యువకులకు అప్పగించారు. 24 ఏళ్ల లోపు వయసున్న ఈ మిత్ర బృందం ఎలాంటి నిరుత్సాహం లేకుండా తమ ఆలోచన పట్ల గొప్ప స్ఫూర్తితో ముందుకు పోతున్నదని ప్రశంసించారు.
ఎలాంటి ఆర్థిక పెట్టుబడి, కుటుంబ నేపథ్యం లేకున్నా మిత్ర బృందంతో కలిసి ఏషియన్‌ పెయింట్స్‌ పెట్టి విజయం సాధించిన స్ఫూర్తిని తాము తీసుకున్నామని యువకులు చెప్పడం అభినందనీయమన్నారు. మంచి మనసుతో, చిత్తశుద్ధితో ఏది ప్రారంభించినా అద్భుతమైన విజయం సాధిస్తుందని, సమాజంలోని అందరి అండ, ఆశీర్వాదం లభిస్తుందన్న విశ్వాసం తనకు ఉందని కేటీఆర్‌ తెలిపారు. ‘డాక్టర్‌ గార్డ్‌’ భవిష్యత్తులో అద్భుతమైన విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. ఈ మిత్ర బృందం ప్రయత్నాన్ని చూసి మరింతమంది యువత ముందుకు రావాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. తమ కార్యాలయానికి విచ్చేసిన కేటీఆర్‌కు ‘డాక్టర్‌ గార్డ్‌’ బృందం ధన్యవాదాలు తెలిపి ఆయన స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *