– ‘సృష్టి’ కేసులో ఇప్పటివరకు 17మంది అరెస్ట్
హైదరాబాద్, ఆగస్టు 6 : గోపాలపురం సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్ (Srushti fertility hospital) కేసులో తాజాగా ఆరుగురిని అరెస్టు చేయగా ఇప్పటివరకు మొత్తం 17 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సమాచారం. అరెస్టయిన వారిలో డాక్టర్లు, ఏజెంట్లు ముఖ్యంగా మహిళా ఏజెంట్లు అధికంగా ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతపై (Namrata) ఒక్క గోపాలపురం పోలీస్ స్టేషన్‌లోనే ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆమెతోపాటు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ విద్యుల్లతను కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. పోలీసులు నమ్రతకు చెందిన బ్యాంకు, హాస్పిటల్ అకౌంట్లు ఫ్రీజ్(freez) చేశారు. ఈ ఖాతాల్లో కోట్ల రూపాయల నగదు జమ అయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మరికొన్ని ఖాతాలను కూడా గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా 70మందికిపైగా భార్యాభర్తలు ఐవీఎఫ్ చికిత్స కోసం వచ్చి సరోగసి పేరుతో మోసపోయారని పోలీసులు వెల్లడించారు. డాక్టర్ నమ్రతతోపాటు మరికొందరు చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డట్లు పక్కా ఆధారాలు లభించాయి. గోపాలపురం పోలీసులు మరోసారి సృష్టి హాస్పిటల్‌కు వెళ్లి కీలక డాక్యుమెంట్లు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కేసుకు మద్దతుగా కీలక ఆధారాలు కానున్నాయి. కాగా, నిందితుల జాబితా ఇంకా పెరిగే అవకాశం ఉంది. డాక్టర్ నమ్రతకు అనుబంధంగా ఉన్న ఇతర హాస్పిటళ్లను, వాటిల్లోని కార్యకలాపాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బును వేరే అకౌంట్లలోకి మళ్లించి ఉండే అవకాశం ఉన్నందున ఆ దిశగా విచారణ జరుగుతోంది. ఈ కేసు కేంద్రం దృష్టికి వెళ్లే అవకాశం కూడా ఉంది. చిన్నారుల అక్రమ రవాణా వంటి విషయాల్లో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించనున్నాయి.




