– పోలీసుల విచారణలో నమ్రత
– ‘సృష్టి’ కేసులో డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: తెలుగు రాష్ట్రాల్లోసంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంచల్‌గూడ జైలో ఖైదీగా ఉన్న డాక్టర్ నమ్రతను శుక్రవారం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఐదు రోజులపాటు నమ్రతను గోపాలపురం పోలీసులు విచారించనున్నారు. తొలిరోజు కస్టడీలో సుమారు ఐదు గంటలుగా నమ్రతకు పోలీసులు ప్రశ్నలు సంధించారు. నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. అయితే.. చైల్డ్ ట్రాఫికింగ్‌పై అడిగిన ప్రశ్నలకు నమ్రత నోరు మెదపడం లేదని సమాచారం. ఎటువంటి తప్పు చేయలేదంటూ సమాధానం చెబుతున్నట్లు తెలుస్తోంది. తాను ఎవరినీ బెదిరించలేదని, మోసం చేయలేదని పేర్కొంది. నిజనిజాలు త్వరలోనే బయటపడతాయని పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది. నమ్రత ఏజెంట్లు, ఆశా వర్కర్ల పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక్కొక్క దంపతుల వద్ద ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ప్రశ్నిస్తున్నారు. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ సృష్టి ఫెర్టిలిటీ బ్రాంచీలపై వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకూ ఎంతమంది తల్లిదండ్రులకు పిల్లలను సరోగసి పేరుతో విక్రయాలు జరిపారు..? న్యాయవాది వృత్తి పేరుతో కొడుకు జయంత్ కృష్ణ బాధితులను బెదిరించడంపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఫెర్టిలిటీ సెంటర్లో నమోదు చేసుకున్న తల్లిదండ్రుల వివరాలపైనా ఆరా తీస్తున్నారు. ఎలాంటి పశ్చాతాపం లేకుండా పిల్లలను దత్తతకు అరేంజ్ చేశామని బహిరంగంగానే నమ్రత చెబుతున్నట్లు సమాచారం. నమ్రతపై హ్యూమన్ ట్రాఫికింగ్‌తోపాటు పలు కేసులు నమోదు అయ్యాయి. పిల్లలు లేని దంపతులను టార్గెట్‌గా చేసుకుని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు.



