సోయాబీన్‌ రైతులకు న్యాయం చేయాలి

– కేంద్రానికి మంత్రి తుమ్మల విజప్తి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: రాష్ట్రంలో ఖరీఫ్‌ 2025-26 సీజన్‌లో అకాల, దీర్ఘకాలిక భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన సోయాబీన్‌ రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కి ప్రత్యేక లేఖ రాశారు. తెలంగాణలో సోయాబీన్‌ ఒక ప్రధాన ఖరీఫ్‌ పంట అని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గిరిజన రైతులు పెద్ద ఎత్తున ఈ పంటపై ఆధారపడ్డారని తెలిపారు. 2025-26 సీజన్‌లో సుమారు 3.66 లక్షల ఎకరాల్లో సాగు జరగగా దాదాపు 2.79 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందన్నారు. అయితే కోత దశలో కురిసిన భారీ వర్షాల వల్ల పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని, దీంతో పెద్ద మొత్తంలో పంట ఎఫ్‌ఏక్యూ నాణ్యత ప్రమాణాలకనుగుణంగా లేదని వివరించారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, సంగారెడ్డి వంటి జిల్లాల్లో గిరిజన రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సుమారు 36 వేల మెట్రిక్‌ టన్నుల సోయాను మద్దతు ధర పథకం కింద కొనుగోలు చేసేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరారు. అవసరమైతే ఎఫ్‌ఏక్యూ నిబంధనల్లో సడలింపులు ఇస్తూ అమలు కావాల్సిన ధర విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ఇలా చేస్తే రైతులు దళారుల చేతిలో నష్టపోకుండా, గిట్టుబాటు ధర పొందగలుగుతారని మంత్రి పేర్కొన్నారు. అలాగే మొక్కజొన్న రైతుల గురించి కూడా మంత్రి తుమ్మల కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఈ ఏడాది మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, మార్కెట్లకు భారీగా పంట రావడంతో ధరలు కనీస మద్దతు ధర కంటే చాలా తక్కువకు పడిపోయాయని తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్రం ఇప్పటివరకు సుమారు 2.96 లక్షల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసి వేలాది రైతులకు అండగా నిలిచిందన్నారు. అయితే, దీని వల్ల రాష్ట్ర ఖజానాపై ఇప్పటికే దాదాపు రూ.750 కోట్ల ఆర్థిక భారం పడిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నాఫెడ్‌ ద్వారా రాష్ట్రం కొనుగోలు చేసిన మొక్కజొన్నను ఇథనాల్‌, డిస్టిలరీ పరిశ్రమలకు సరఫరా చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కేంద్రాన్ని కోరారు. దీనివల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం తగ్గడంతోపాటు మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పనలో రాష్ట్రానికి చేయూతనిచ్చినట్లు అవుతుందన్నారు. కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటే కొనుగోలు, నిల్వ, రవాణా, లాజిస్టిక్స్‌, మౌలిక వసతుల పరంగా పూర్తి సహకారం అందిస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఇదే విషయంపై కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డిలకు కూడా లేఖలు రాసిన మంత్రి తుమ్మల, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకునేలా చొరవ చూపాలని వారిని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *