– స్వావలంబనకు సంస్కరణలు అవసరం
– ప్రజలకు అనుకూలంగా ఎన్డీఏ ప్రభుత్వం
– ప్రధాని నరేంద్రమోదీ
న్యూదిల్లీ, సెప్టెంబరు 4: కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ సంస్కరణలతో దేశ ప్రజలకు దీపావళి గిప్ట్ ఇచ్చామన్నారు. దీంతో దీపావళికి ముందే దేశ ప్రజల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు. దీపావళి, చత్ పూజకు ముందే దేశ ప్రజలకు డబుల్ దమాకా ఇస్తామని ఆగస్ట్ 15 సందర్భంగా ఎర్రకోట నుంచి హా ఇచ్చాను.. మాట ఇచ్చినట్లుగానే దీపావళికి ముందే ప్రజలకు గిప్ట్ ఇచ్చానన్నారు. వస్తుసేవల పన్ను రేట్లలో సంస్కరణలపై ప్రధాని మోదీ స్పందించారు. దేశాన్ని స్వావలంబన దిశగా మార్చడానికి తదుపరి తరం సంస్కరణలు అవసరమని భావించామని, ఇందుకు అనుగుణంగానే తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. దీపావళి, ఛత్‌పూజకు ముందే ప్రజలకు రెట్టింపు ఆనందం ఉంటుందని హా ఇచ్చామని.. చెప్పినట్లుగానే ప్రజలకు సంతోషకరమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. జాతీయ అవార్డులు పొందిన టీచర్లను ఉద్దేశించి మాట్లాడిన మోదీ పన్నులపై కాంగ్రెస్ అనుసరించిన తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిన్నారుల చాక్లెట్ల నుంచీ ప్రతి వస్తువుపైనా భారీగా పన్ను వసూలు చేసిందన్నారు. ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. దేశాన్ని స్వావలంబన దిశగా మార్చడానికి తదుపరి తరం సంస్కరణలు అవసరమని భావించానని.. అందుకే జీఎస్టీ పన్ను విధానంలో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కొత్త సంస్కరణల వల్ల ఆత్మనిర్భర భారత్ లక్ష్యం మరింత ముందే సాకారం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. జీఎస్టీ శ్లాబుల సవరణలతో అందరికీ ప్రయోజనం ఉంటుందని.. సమయాన్ని బట్టి సంస్కరణలు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశ స్వాతంత్య్రం తర్వాత జీఎస్టీ సంస్కరణలు అతిపెద్ద నిర్ణయంగా అభివర్ణించారు. సంస్కరణలతో జీఎస్టీ పన్ను విధానం మరింత సులభతరంగా, పారదర్శకంగా మారింద న్నారు. జీఎస్టీ సంస్కరణలు దేశానికి మద్దతు, వృద్ధికి డబుల్ డోస్ అని అభివర్ణించారు. జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు సరళమైన పన్ను వ్యవస్థ, జీవన నాణ్యతను మెరుగుపరచడం, వినియోగం మరియు వృద్ధిని పెంచడం, వ్యాపార సౌలభ్యత, సహకార సమాఖ్యవాదం అనే ఐదు రత్నాలను జోడించాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన సమయంలో మార్పులు అవసరమని.. అలా అయితేనే ప్రపంచంలో మన దేశాన్ని సరైన స్థానంలో నిలబెట్టొచ్చన్నారు. సెప్టెంబర్ 22న అంటే నవరాత్రి మొదటి రోజున జీఎస్టీ తదుపరి తరం సంస్కరణలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. కాగా, జీఎస్‌టీలో భారీ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 5, 12, 18, 28 శాతాల్లో నాలుగు రకాలుగా ఉన్న జీఎస్టీ ట్యాక్స్ స్లాబ్‌లను ఇకపై 5 శాతం, 18 శాతం స్లాబ్‌లకే పరిమితం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ హయాంలో భారీగా పన్నులు వేశారు. చిన్నారుల చాక్లెట్లపైనా 21శాతం పన్ను వసూలు చేశారు. నేనే ఆ పని చేసివుంటే.. నాపై తీవ్ర విమర్శలు చేసేవారు. మా ప్రభుత్వ విధానం మాత్రం ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే. నవరాత్రి తొలి రోజు నుంచే జీఎస్టీ కొత్త రేట్లు- అమల్లోకి రానున్నాయి. ఈ సంస్కరణల ద్వారా ఆర్థిక వ్యవస్థకు కొత్తగా పంచరత్నాలను జోడించాం. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో పేదలు, మధ్యతరగతి, మహిళలు, విద్యార్థులు, రైతులు, యువత.. ప్రతిఒక్కరికీ ప్రయోజనం ఉంటుంది. వీటివల్ల మరింత ముందుగానే ఆత్మనిర్భర భారత్ సాకారమవుతుంది. హెయిర్‌క్లిప్‌లు కూడా విదేశాల నుంచి తెచ్చుకునే విధానం మారాలి. ప్రస్తుతం రూ.లక్ష కోట్ల విలువైన వంటనూనె దిగుమతి చేసుకుంటున్నాం. ఇంత మొత్తం బయటకు వెళ్లకుండా ఆపగలిగితే ఎన్నో పాఠశాలలు నిర్మించుకోవచ్చు. చంద్రయాన్ విజయంతో శాస్త్రవేత్తలు కావాలనే కాంక్ష మన విద్యార్థుల్లో పెరిగింది. నూతన ఆవిష్కరణలకు సమయం ఆసన్నమైంది. టీచర్లు విద్యాబుద్ధులు నేర్పడమే కాదు.. యువతరానికి దారి చూపాలి. చిన్నారుల్లో డిజిటల్ దుష్పభ్రావాన్ని కూడా తగ్గించే బాధ్యత మనపై ఉంది. గ్యాంబ్లింగ్ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. గాంధీజీ నినాదం స్వదేశీ.. దాన్ని అందరం అమలు చేద్దాం. దేశీయ ఉత్పత్తుల వినియోగంతో దేశ రూపురేఖలు మారిపోతాయి. మేడిన్ ఇండియాపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలి. మనదేశంలో తయారైన వస్తువులనే వాడాలి. ఇందుకు సంబంధించి ప్రతి ఇల్లు, దుకాణం బయట బోర్డులు కనిపించాలని మోడీ పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



