– వార్త ప్రసారం చేసిన ఛానల్‌పై చర్యలేవీ?
– కేవలం ఉటంకించిన ఛానళ్లపై చర్యలా?
– మీడియా సంస్థలపై దాడులు ఆపాలి
– డిజిటల్ మీడియా సంస్థలను వేధించడమే ‘సిట్’ లక్ష్యం
– కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 13: పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి రేవంత్ ప్రభుత్వం తరచూ డైవర్షన్ డ్రామాలు ఆడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అధికార పక్షానికి సన్నిహితంగా ఉండే టీవీ ఛానెల్ ఒక మంత్రిపై వేసిన వార్తా కథనాన్ని కేవలం ఉటంకించినందుకు అనేక ఇతర ఛానెళ్లు, డిజిటల్ మీడియా హ్యాండిళ్లపై దర్యాప్తు చేయడానికి రేవంత్ ప్రభుత్వం ఏకంగా ‘సిట్’ ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ అన్నారు. వార్త వేసిన అసలు ఛానెల్ మీద చర్యలు తీసుకోకుండా సిట్ పేరుతో ఈ కొత్త నాటకాలు ఎందుకని, అసలు ఈ సిట్ ఎవరిని కాపాడటానికి లేదా ఎవరిని వేటాడడానికి అని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఓవరాక్షన్ ప్రజలంతా గమనిస్తున్నారని, మీడియా సంస్థల మీద ఈ వేధింపులు ఆపకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. నిజంగానే ప్రత్యేక దర్యాప్తు చేయాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు ,అక్రమాలపై చేయాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారులో జరుగుతున్న అనేక దారుణాలపై ఎందుకు ‘సిట్ ‘ వేయడం లేదని నిలదీశారు. సాక్షాత్తూ ఒక మంత్రి పీఏ, రేవంత్ రెడ్డి సహచరుడు కలిసి ఒక పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టి రూ.300 కోట్లు డిమాండ్ చేస్తే దానిపై విచారణ చేయడానికి ‘సిట్’ ఉండదని ఎద్దేవా చేశారు. అదేవిధంగా ములుగు జిల్లాలో మంత్రి పీఏనే ఇసుక దందాలో కోట్లు దండుకుంటున్నా సదరు ఇసుకాసురుల మీద కేసులు లేవని, రెవెన్యూ మంత్రి కొడుకు 70 మంది గూండాలను వెంటబెట్టుకుని హైదరాబాద్ శివార్లలో వందల కోట్ల భూకబ్జాకు పాల్పడితే ఉల్టా ఆ కేసు నమోదు చేసిన పోలీస్ అధికారిని బదిలీ చేస్తారు కానీ ఆ కబ్జాల విచారణకు మాత్రం సిట్ ఉండదని ఆయన ధ్వజమెత్తారు. ఏఐసీసీ సెక్రటరీ, రేవంత్ సన్నిహితుడు సంపత్ కుమార్ ఒక నేషనల్ హైవే కాంట్రాక్టర్‌ను మారణాయుధాలతో బెదిరించి రూ. 8 కోట్లు డిమాండ్ చేసినా ఎటువంటి చర్యలు లేవని విమర్శించారు. కస్తూరిబా గాంధీ పాఠశాలల్లో బంకర్ బెడ్స్ కొనుగోలులో జరిగిన రూ.100 కోట్ల కుంభకోణంపై గానీ, వందల కోట్ల లిక్కర్ హోలోగ్రామ్ టెండర్ల వివాదంలో ఒక ఐఏఎస్ అధికారిని బలిచేసిన ఉదంతంపై గానీ ఎందుకు ‘సిట్’ వేయలేదని ప్రశ్నించారు. కాసుల కక్కుర్తి కోసం నిబంధనలకు విరుద్ధంగా చీప్ లిక్కర్ కంపెనీలకు అనుమతులిచ్చి వందల కోట్లు కొల్లగొట్టిన స్కామ్ మీద, అలాగే 400 ఎకరాల యూనివర్సిటీ భూమి అమ్మకంలో పెద్ద ఫ్రాడ్ జరిగిందని సుప్రీంకోర్టు కమిటీ తేల్చినా ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. విచారణల పేరిట కమిషన్లు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ల ఏర్పాటు కేవలం కాలయాపనకేనని ఆయన విమర్శించారు. కేవలం ప్రశ్నించే గొంతుకలైన మీడియా, డిజిటల్ మీడియా సంస్థలను వేధించడానికే ఈ సిట్ గారడీలు చేస్తున్నారని, పార్టీ అంతర్గత కుమ్ములాటలు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను దాచి ఉంచేందుకే డ్రామాలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
————————————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




