జిల్లాల‌ను ర‌ద్దు చేస్తే ఊరుకోం

– పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప‌క్క‌న పెట్టారు
– రైతుల‌కు యూరియా అందించ‌లేని ప్ర‌భుత్వం
– కాంగ్రెస్ పాల‌న‌లో ఉన్న ప‌థ‌కాలు పోయాయి
– ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌మంటే తిట్ల పురాణ‌మా?
– బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మ‌హ‌బూబ్ న‌గ‌ర్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12:  కాంగ్రెస్ పార్టీ జిల్లాలను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనను బిఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలను రద్దు చేస్తాం, వాటిని శాస్త్రీయంగా చేయలేదు అంటూ చెబుతున్న సాకుల పైన కూడా కేటీఆర్ మండిపడ్డారు. జిల్లాలను రద్దు చేస్తే ఎవ్వరూ ఊరుకోరని హెచ్చరించారు. మహబూబ్ నగర్ ఎంబిసి గ్రౌండ్‌లో సర్పంచ్‌ల ఆత్మీయ అభినందన సభకు ఆయ‌న హాజ‌ర‌య్యారు. కలెక్టర్లను, జిల్లా ఎస్పీలను ప్రజల వద్దకు తీసుకువచ్చి పాలనా ఫలాలు అందిస్తే సహించలేక, ప్రజలకు అందుతున్న అభివృద్ధి ఫలాలను చూడలేకనే జిల్లాలను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందన్నారు. ఏ జిల్లాను రద్దు చేసినా అక్కడ అగ్గి పుట్టిస్తామని, ప్రజలతో కలిసి ప్రభుత్వం పై తీవ్రంగా పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. జిల్లాలను రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదని హెచ్చరించారు. కేసీఆర్  ప్రజల వద్దకు పరిపాలన, అభివృద్ధిని తీసుకుపోయే విధంగా పరిపాలన వికేంద్రీకరణను చేపట్టారు. అందుకే తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడంతోపాటు నూతన మండలాలు, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశార‌ని తెలిపారు. దీంతోపాటు జిల్లా యంత్రాంగం అంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని, కలెక్టర్లు, ఎస్పీలు ప్రజల మధ్య ఉండాలన్న సదుద్దేశంతో చిన్న జిల్లాలను ఏర్పాటు చేశామ‌న్నారు.

పాలమూరు ప్రజలకు సమాధానం చెప్పాల

లక్షలాది ఎకరాలకు గత ప్రభుత్వం నీళ్లు ఇవ్వడంతో వలసపోయిన ప్రతి మహబూబ్ నగర్ బిడ్డ తిరిగి వచ్చారని కేటీఆర్ అన్నారు. కానీ మహబూబ్ నగర్ బిడ్డను అని చెప్పుకునే రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టును కావాలనే అడ్డుకుంటున్నారన్నారు. కనీసం రైతన్నలకు యూరియా బస్తాలు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం, రైతన్నలకు మంచి చేసి మహబూబ్ నగర్‌ను సస్యశ్యామలం చేస్తామని చెప్తే ఎవరు నమ్ముతారని కేటీఆర్ ప్రశ్నించారు. 17వ తేదీన పాలమూరుకు వస్తున్న ముఖ్యమంత్రి పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన పదుల సంఖ్యలో పరిశ్రమలన్నీ ఎందుకు వెళ్లిపోయాయో పాలమూరు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన ఐటీ టవర్‌ని ఎందుకు పక్కన పెట్టారని కేటీఆర్ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రూ.9,500 కోట్లతో అమరరాజా వంటి భారీ పెట్టుబడులను తెలంగాణకు, ముఖ్యంగా మహబూబ్ నగర్‌కే తీసుకువచ్చామని కేటీఆర్ అన్నారు. పెళ్లిళ్లకు, చావులకు వెళ్లడం తప్పించి ప్రజలకు చేయడానికి మొన్నటి దాకా ఒక్క రూపాయి కూడా లేదు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి స్వయంగా చెబుతున్నారన్న విషయాన్ని మహబూబ్ నగర్ ప్రజలు గుర్తుంచుకోవాలని కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఉన్న పథకాలు పోయాయన్నారు. రైతుబంధు కేసీఆర్‌ 2 పంటలకు ఇస్తే రేవంత్‌ 3 పంటలకు ఇస్తానని చెప్పాడు. వృద్ధులకు డబుల్ పెన్షన్ అన్నారు.. కల్యాణ లక్ష్మికింద తులం బంగారం అని హామీ ఇచ్చారు.. కానీ మేము ఆ రోజే చెప్పాము.. కాంగ్రెస్‌ బంగారమిచ్చే బ్యాచ్‌ కాదు.. పుస్తెలు ఎత్తుకుపోయే బ్యాచ్ అని కెటిఅర్ అన్నారు. పాలమూరు బిడ్డ రేవంత్‌కు బంగారం దొరకడం లేదా? ఉన్న హామీలే అమలు చేయడం చేతకాని రేవంత్ కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెబుతున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కోటి కోట్లు ఉన్నాయా? అబద్ధాలు ఆడినా అతికినట్టు ఉండాలి.. కానీ రేవంత్ సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నాడని విమర్శించారు. పంచాయతీలకి మంచినీళ్ల నుంచి మొదలుకొని పారిశుద్ధ్యం దాకా అన్ని రంగాల్లో కేసీఆర్ అద్భుతమైన ప్రగతి సాధించేలా గ్రామాలను తీర్చిదిద్దారు. రెం డేళ్ల‌లో ఉన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రేవంత్ పక్కన పెట్టాడని, ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీల అమలు గురించి ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నాడన్నారు. అందుకే పంచాయతీ ఎన్నికల్లో బిఅర్ఏస్ వైపు ప్రజలు నిలిచారని కెటిఅర్ అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో ముందుకు పోవాలి, గట్టి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్‌లు వాల్యా నాయక్, ఆంజనేయులు గౌడ్, ఇంతియాజ్, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *