– అట్రాసిటీ నేరాలపై మంత్రి అడ్లూరి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితుల” 194మందిక్ణి రూ.30 లక్షల విలువగల డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మల్కాజిగిరి కమిషనర్ కార్యాలయంలో బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నేరాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దళిత, బడుగు, బలహీనవర్గాలకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరిస్తుందని, వారికి అట్రాసిటీ చట్టం బాసటగా నిలుస్తుందని మంత్రి లక్ష్మణ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ బాధితులకు తగు న్యాయం చేసేలా చొరవ తీసుకోవాలని కోరారు. దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలు జరిగినప్పుడు బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని అన్నారు. కేవలం డబుల్ బెడ్ రూమ్‌లతో కాకుండా సంక్షేమ శాఖ ద్వారా బాధితులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రుణాలతోపాటు ఇతర సహాయం సబ్సిడీపరంగా అందించేందుకు, జీవనోపాధి కల్పించే విధంగా జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇకపై బాధితులకు ఎలాంటి ఆలస్యం జరగకుండా టైం బౌండ్ ప్రోగ్రాం రూపొందించుకుని వారికి న్యాయం చేయాలన్నారు. అవమానం, నష్టం జరిగిన బాధితులకు పీసీ¾ఆర్ పీవోఏ యాక్ట్ ప్రకారం న్యాయం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు బాధితుల పక్షాన నిలబడి నిరంతరం వారికి సహాయ, సహకారాలు అందిస్తున్నారని మంత్రి కొనియాడారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఉపయోగించి వాస్తవంగా నష్టపోయిన వారికి వీలైనంత త్వరగా న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు. దళిత, గిరిజన వర్గాలు చదువు వల్ల గొప్పగా రాణించగలుగుతారని, అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను నిర్మించేందుకు ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో బృహతర కార్యక్రమాన్ని రూపొందించారని మంత్రి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ పిల్లలు గొప్పగా చదువుకుని రాణించాలని ఆకాంక్షించారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి నష్టం ఇబ్బంది కలిగినా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, తెలంగాణ సాంస్కృతిక సారథి గుమ్మడి వెన్నెల, మల్కాజిగిరి పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి, మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ చౌదరి, ఉప్పల్ జోన్ డిప్యూటీ కమిషనర్ సురేష్ కుమార్, మల్కాజిగిరి జోన్ డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీధర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, రాంబాబు నాయక్, ఎన్జీవో బిట్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





