చీర‌ల పంపిణీ పార‌ద‌ర్శ‌కంగా సాగాలి

– ఎస్‌హెచ్‌జీలో లేని వారికి సభ్యత్వం కల్పించి చీరలు ఇవ్వాలి
– యాప్‌ ద్వారా పంపిణీ వివరాలను నమోదు చేయాలి
– అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత క్రమశిక్షణతో, పారదర్శకంగా నిర్వహించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సెర్ప్‌ ఉన్నతాధికారులతో గురువారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి ఈమేరకు దిశా నిర్దేశం చేశారు. మహిళల గౌరవం, వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఈ మహత్తర కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో సాగాలన్నారు. స్వయం సహాయక బృందాల్లో లేని మహిళలకు అవగాహన కల్పించి వెంటనే వారికి సభ్యత్వం ఇచ్చి ఇందిరమ్మ చీరలను అక్కడికక్కడే అందించాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశించారు. నూతన లబ్దిదారులను గుర్తించేందుకు పౌర సరఫరాల శాఖ సహకారాన్ని తీసుకోవాలన్నారు. ప్రస్తుత, కొత్త లబ్ధిదారుల వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన సెర్ప్‌ ప్రొఫైల్‌ యాప్‌ ద్వారా నమోదు చేయాలన్నారు. ప్రతి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రచారం పెంచాలని సీతక్క ఆదేశించారు. మహిళా స్వయం సహాయక బృందాల ప్రాముఖ్యతను, ఇందిరా మహిళా శక్తి విజయాలను చాటే విధంగా నియోజకవర్గ, మండలస్థాయిలో ప్రారంభ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పర్యవేక్షణలో జరగాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులందరినీ మండలస్థాయి కార్యక్రమాలకు ఆహ్వానం పలకాలని ఆమె అధికారులకు నిర్దేశించారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ సిబ్బందితోపాటు గ్రామ మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు లబ్దిదారుల నివాసాలకు వెల్లి ఇందిరమ్మ చీరలను బొట్టుపెట్టి అందజేయాలని సూచించారు.

బీఆర్‌ఎస్‌పై సీతక్క ఫైర్‌

కామారెడ్డి పర్యటనలో తనను రైతులు అడ్డుకున్నట్లు బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. సొంత సోషల్‌ మీడియా కారణంగా జూబ్లీహిల్స్‌లో చిత్తుగా ఓడినా బీఆర్‌ఎస్‌కు బుద్ది రాలేదన్నారు. అతి చిన్న వయసులో ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించిన గిరిజన బిడ్డ మాలవత్‌ పూర్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుంటే బీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాన్వాయికి అడ్డుగా వచ్చాడని తెలిపారు. గిరిజన బిడ్డ కుటుంబ పరామర్శను కూడా బీఆర్‌ఎస్‌ తట్టుకోలేకపోతోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే కర్షకుల ప్రభుత్వమ‌న్నారు. వైఎస్సార్‌ హయాుంలో ఉచిత విద్యుత్‌ మొదలుకుని పంట బోనస్‌ దాకా, తమ రైతు ప్రభుత్వం కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింద‌ని చెప్పారు. బీఆర్‌ఎస్‌ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. డిసెంబర్‌ 11న స్థానిక ఎన్నికల షెడ్యూుల్‌ వస్తుందని తాను ఎక్కడా చెప్పలేదని, అవాస్తవాలను ప్రచారం చేయొద్దని కోరుతున్నా అన్నారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.. అయినా బీసీలకు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page