– అస్సాం ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొ. రాజేంద్ర ప్రసాద్ దాస్
– అంబేద్కర్ వర్సిటీలో ఘనంగా రాంరెడ్డి 96వ జయంతి
హైదరాబాద్, ప్రజాతంత్ర డిసెంబర్ 4 : దూరవిద్య పితామహుడు, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ జి. రాంరెడ్డి అని అస్సాం సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ దాస్ అన్నారు. గురువారం ఆచార్య జీ రామిరెడ్డి 96వ జయంతి కార్యక్రమం ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన డా. బి.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్ లో ప్రొఫెసర్ జి.రామ్ రెడ్డి స్మారకోపన్యాసాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణకాంత హండికి స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ (అస్సాం) వైస్ ఛాన్సలర్ ప్రొ. రాజేంద్ర ప్రసాద్ దాస్ ముఖ్య అతిథిగా హాజరై “నూతన విద్యా విధానం 2020 యుగంలో భారతీయ ఓపెన్ యూనివర్సిటీలను పునఃసృష్టించడం” అనే అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ దూర విద్యా విధానంలో అభ్యసించే విద్యార్ధుల ఉపాధి సామర్థ్యం పెంచడానికి అవసరమైన సాంకేతికతను విశ్వవిద్యాలయాలు సమకూర్చుకోవాలని సూచించారు. డిజిటల్ అక్షరాస్యత, కమ్యూనికేషన్ మరియు ప్రతీ అంశంపై నిశిత పరిశీలన వంటి నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ దాస్ ఉద్గాటించారు. విద్యార్ధుల అభ్యసనానికి అవసరమైన టెక్నాలజీని విరివిగా వాడడం, రియు మైక్రో–క్రెడెన్షియల్స్ కోర్సుల రూపకల్పన, మల్టీమోడల్ లెర్నింగ్, ఎఐ-ఎనేబుల్డ్ అధ్యయనంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అవగాహన ఒప్పందాలు జరగాలన్నారు. పరిశ్రమకు అవసరమైన విధంగా విద్యార్ధుల్లో స్కిల్ పెంపొందే విధంగా పాఠ్యాంశాల రూపకల్పన జరగాలని వివరించారు. విద్యార్ధులకు ఎక్కువగా ఇంటర్న్‌షిప్‌లు, సర్టిఫికేషన్‌ల కోసం, ఉపాధి కల్పనకు ఈ అవగాహనా ఒప్పందాలు కీలకంగా మారుతాయన్నారు. అది అటు విద్యార్ధులకు ఇటు విద్యా సంస్థలకు ఉపయోగకరంగా నిలుస్తుందని వివరించారు. దూర విద్యలో అభ్యసించే విద్యార్ధులకు సమ్మిళిత, నాణ్యమైన విద్య అందుబాటులోకి తెచ్చినప్పుడే ప్రొఫెసర్ రెడ్డి ఆశయ కృషి చేసినట్లు అవుతుందన్నారు. ఆ దిశగా దేశంలోని అన్ని విద్యా సంస్థలు కృషి చేయాలని ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ దాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, మాజీ విసి ప్రొఫెసర్ సీతారామారావు, రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్, వర్సిటీ స్టూడెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై. వెంకటేశ్వర్లు, పి ఆర్ ఓ డాక్టర్ పి.వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



