మేధావులతో చర్చించే మూసీపై ముందుకు

– అధికారం ప్రజలపై ఆధిపత్యం చలాయించేందుకు కాదు
– ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా అర్ధసత్యాలు ప్రచారం
– మూసీ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలి
– మూసీ ఇన్‌వైట్స్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశపూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధసత్యాలను ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని కాపలాదారుగా వినియోగిస్తాం తప్ప ప్రజలపై ఆధిపత్యం చెలాయించడానికి కాదు అని తమ ప్రభుత్వం నమ్ముతుందన్నారు. అందుకే ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతతో మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మూసీ ఇన్‌వైట్స్ కార్యక్రమం ద్వారా వాస్తవాలను ప్రజలకు చెప్పాలని భావించామన్నారు. మానవ నాగరికత నది చుట్టూనే అభివృద్ధి చెందిందని, ప్రపంచ దేశాలు అభివృద్ధి పథంలో నడుస్తుంటే మనం వెనకబడితే భవిష్యత్ తరం మనల్ని క్షమించదని పేర్కొన్నారు. అన్ని వర్గాల మేధావులతో సమావేశమై ఎలాంటి అభివృద్ధి చేయాలనే అంశంపై సూచనలు తీసుకున్నామని చెప్పారు. 1908 మూసీ వరదలు నగరాన్ని ముంచెత్తగా ఆ సమయంలో ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో సంప్రదించి వరదల నియంత్రణకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లను నిజాం నిర్మించారని గుర్తు చేశారు. వందేళ్లుగా వరద ముప్పు నుంచి నగరాన్ని కాపాడటమే కాదు.. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆ రిజర్వాయర్లు ఉపయోగపడుతున్నాయన్నారు. గొప్ప వారసత్వ సంపద కలిగిన ఈ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా అని ప్రశ్నించారు. నేను ఎవరినీ విమర్శించదలచుకోలేదు.. కానీ విజ్ఞప్తి చేయదలచుకున్నా.. పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్లు ఎందుకు మూసీ ప్రక్షాళన అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకోవడం సమస్యకు పరిష్కారం కాదు.. ఎందుకు అడ్డుకుంటున్నారో కారణం చెప్పండి.. ఏదైనా తప్పులు ఉంటే సూచనలు చేయండి అని కోరారు.
పాలకులు మారినా నగర అభివృద్ధి ఆగలేదు.. 1994 నుంచి ఇప్పటివరకు పరిపాలనలో పాలసీ పెరాలసిస్ ఎప్పుడూ రాలేదన్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేసినా కొంతమందినే గుర్తుంచుకుంటాం దార్శనికతతో అభివృద్ధి ప్రణాళికలు రచించి అభివృద్ధి చేసిన వారే చరిత్రలో గుర్తుంటారన్నారు. మూసా, ఈసా నదుల సంగమం వద్ద ఆనాడు మహాత్మా గాంధీ అస్థికలు కలిపారని, అంతటి చరిత్ర ఉన్న బాపూ ఘాట్‌ను ఎంతమంది పర్యాటకులు సందర్శిస్తున్నారు అని అడిగారు. కాలుష్యంతో మూసీ నది విషతుల్యంగా మారిందని, మానవ తప్పిదాలతో నల్లగొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలో పుట్టిన మూసీ నది హైదరాబాద్‌కు వచ్చేసరికి కాలుష్యమయంగా మారుతోందన్నారు. మూసీకి, హైదరాబాద్ నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందంటూ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ చరిత్రను కాలగర్భంలో కలిపేద్దామా.. లేక మూసీ నదితోపాటు హైదరాబాద్ నగరాన్ని పునరుజ్జీవింపజేసుకుందామా అని నిలదీశారు. ఎవరికో నష్టం కలిగించాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో బుల్డోజర్లు తీసుకెళ్తున్నారని కొందరు అంటున్నారు.. కేంద్రం తెచ్చిన చట్టాన్ని అమలు చేస్తామంటే కొందరు అడ్డుపడతామంటున్నారు.. కేవలం ఇది మూసీ పునరుజ్జీవనం మాత్రమే కాదు.. మన సంస్కృతిని, చరిత్రను కాపాడుకోవడం అని పేర్కొన్నారు. ఇవాళ మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకుంటున్న వారు మూసీ పరీవాహకంలో నివసించగలరా అని ప్రశ్నించారు. వాళ్లు ఉంటానంటే అన్ని సౌకర్యాలతో కంటైనర్ హౌస్ ఇస్తా.. మూడు నెలలు అక్కడ ఉండగలరా అని నిలదీశారు. పేదలకు సరైన మౌలిక వసతులు కల్పించొద్దా? బ్లూ కాలర్ జాబ్స్ క్రియేట్ చేయొద్దా? పర్యటక అభివృద్ధి జరగొద్దా? నైట్ ఎకానమి అభివృద్ధి చెందొద్దా? అన్నారు. నిజాం చేసినదాంట్లో పది శాతం కూడా మనం చేయకపోతే చరిత్ర మనల్ని క్షమిస్తుందా? బ్యూటిఫికేషన్.. లూటిఫికేషన్ అని కొందరు మాట్లాడుతున్నారు. రూ.5 వేల కోట్లతో గాంధీ విగ్రహం అంటూ సొంత తెలివి ప్రదర్శిస్తున్నారు. ఎంత పెద్ద యుద్ధాన్నైనా శాంతితో గెలవచ్చని మహాత్మా గాంధీ నిరూపించారు. అలాంటి మహాత్ముడి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనపై లేదా? లోకకళ్యాణం కోసం చేసే పనులకు సహకరించకపోయినా ఫరవాలేదు.. కానీ దయచేసి అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు అని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదు.. ఎవరి ఆస్తులు గుంజుకునేందుకు కాదు.. ఇది భవిష్యత్తరాల కోసం మనం చేస్తున్న అభివృద్ధి.. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం అని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగినపుడు కూడా కొందరు భూములు కోల్పోయారు. మూసీ బాధితులకు ఎలాంటి పరిహారం ఇద్దామో చెప్పండి.. మూసీ పరివాహక నిరాశ్రయుల పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయి అని సీఎం చెప్పారు. జన ఆందోళన్ సంఘంతో మాట్లాడి తమ ప్రభుత్వం ఇండ్లు నిర్మించే ప్రయత్నం చేస్తోంది. స్కూల్స్, ఇతర సౌకర్యాలతోపాటు ఆ పరిసర ప్రాంతాల్లో వారికి ఉపాధి కలిగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తే తప్పేంటి అని అడిగారు. పర్యాటకం అభివృద్ధి చేస్తే తప్పేంది? ప్రపంచమంతా మన హైదరాబాద్ వైపు చూస్తోంది. పేదవాళ్లను నిరాశ్రయులను చేయాలని మేం అనుకోవడంలేదు అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ముఖ్య నేతలు, మేధావులు, పర్యావరణ నిపుణులు, అర్బన్ ప్లానర్లు, ఆర్కిటెక్టులు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *