– ఇప్పటికే ఇరాన్‌తో మంత్రి జైశంకర్ చర్చలు
– విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్
న్యూదిల్లీ, మార్చి 12: ఇంధన భద్రతపై ఇరాన్‌తో చర్చిస్తున్నామని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. దేశ ఇంధన భద్రతపై ఇరాన్‌తో విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ మాట్లాడారని రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. హర్మూజ్ మీదుగా భారత్‌కు వచ్చే నౌకల ప్రయాణం గురించి కూడా చర్చించినట్లు తెలిపారు. మరోవైపు, డీజిల్ సరఫరా కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని, దానిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. శ్రీలంక, మాల్దీవుల నుంచీ ఇదే తరహా అభ్యర్థనలు వచ్చాయని, అయితే.. ముందుగా మన దేశ అవసరాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం ఇరాన్‌లో దాదాపు తొమ్మిది వేల మంది భారతీయులు ఉన్నారని.. వీరిలో విద్యార్థులు, నౌకా సిబ్బంది, వ్యాపారవేత్తలు, యాత్రికులు ఉన్నట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఘర్షణ మొదలైన వెంటనే విద్యార్థులు సహా అనేక మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులందరికీ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మన రాయబార కార్యాలయం అన్ని సమయాల్లో అందుబాటులో ఉందన్నారు. అఫ్గాన్‌తో ఇటీవల ఘర్షణకు భారత్ కారణమంటూ పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత విదేశాంగశాఖ ఖండించింది. అవి నిరాధార ఆరోపణలని స్పష్టం చేసింది. తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్‌పై నిందలు వేయడం పాకిస్థాన్‌కు పరిపాటేనని విమర్శించింది. దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం మాటలకు విశ్వసనీయత లేదని తెలిపింది.
ఇంధన కొరత, ధరలపై కేంద్రం అప్రమత్తం
భారత్‌పై మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావంతో ఇప్పటికే భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఎల్‌పీజీ సంక్షోభం నెలకొంది. పెట్రోల్, డీజిల్ ధరలపై సామాన్యులు భయపడుతున్నారు. ఈ ధరలు రానున్న రోజుల్లో విపరీతంగా పెరుగుతాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. పెట్రోల్, డీజిల్ ధరలపై క్లారిటీ ఇచ్చింది. ఈ ధరపై ప్రస్తుతం ప్రభావం ఉండబోదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశీయంగా చమురు ధరలను స్థిరంగా ఉంచేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇంధనం సరఫరాలోనూ ఎలాంటి ఆటంకాలు కలగకుండా ’ఫ్యూయల్ సప్లై మేనేజ్‌మెంట్ చైన్’ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం ఇప్పటికే యాక్టివేట్ చేసినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ కథనం వెల్లడించింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ’స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్’ మార్గంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. వాస్తవానికి గతంలో ’స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్’ గుండా భారత్ 40శాతం చమురును దిగుమతి చేసుకునేది. ఈ మిడిల్ ఈస్ట్ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్ వ్యూహాన్ని రూపొందించింది. హార్ముజ్ మార్గం కాకుండా ఇతర ప్రాంతాల నుంచి చమురు దిగుమతులను 60 శాతం నుంచి 70 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దాదాపు 40 దేశాల నుంచి భారత్ చమురును సేకరిస్తోంది. ఈ కొత్త మార్గం ద్వారా చమురు దిగుమతి చేసుకోవడంతో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ సంక్షోభం లేదని తెలుస్తోంది. కానీ.. భవిష్యత్తులో యుద్ధం ఇంకా ముదిరితే మాత్రం భారత్‌పై ఎఫెక్ట్ పెద్ద ఎత్తున ఉండబోతోందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇక ఎల్పీజీ విషయంలో కేంద్రం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇటీవల జరిగిన గ్యాస్ ధరలు చాలా స్వల్పమని, ఇక మీద ధరల పెంపు ఏమీ ఉండబోదని ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎక్కడా గ్యాస్ కొరత లేదని, ప్రజల అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.



