ఎస్సీ ,ఎస్టీల బడ్జెట్ కేటాయింపులపై చర్చించాలి

– ఎస్సీ, ఎస్టీ ప్రజా సంఘాల జేఏసీ

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 18: ఎస్సీ, ఎస్టీల సంక్షేమ అభివృద్ధి రక్షణల పై అసెంబ్లీ చర్చించాలని ఎస్సీ ఎస్టీ ప్రజాసంఘాల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అధ్యక్షతన బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మేధావులు, వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ బడ్జెట్, కేటాయింపులు ఖర్చులపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు 18 శాతం బడ్జెట్,  విద్యకు 20 శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తున్న బడ్జెట్ ఖర్చు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్న‌ది. కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు ఏ ఒక్క కొత్త పథకాన్ని కూడా అమలు చేసిన పాపానికి పోలేదు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చేవెళ్ల డిక్లరేషన్ ప్రకటించి ఓట్లు కొల్లగొట్టింది. కానీ ఎస్సీలకు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయ హస్తం ప్రారంభించి రూ.12లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామన్న హామీ నేటికి కార్యరూపం దాల్చలేదు. పెరుగుతున్న ఎస్సీల జనాభా ప్రకారం 18 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రకటించింది . కానీ నేటికీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఎస్సీ ల సంక్షేమానికి బడ్జెట్ లో పెద్దపీట వేస్తున్నామని 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.40.231.62 వేల కోట్లను కేటాయించి కేవలం రూ.19894.91వేల కోట్లు విడుదల చేసి రూ.14732.94 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 9 శాఖలు ఒక్క రూపాయి కూడా దళితుల సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు చేయలేదు. పైగా 3213.59 వేల కోట్లను దారి మళ్ళించారు. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధుల కేటాయింపు చట్టం కింద 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీల జనాభా 18 శాతం ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు. 2025-26లో ఖర్చు చేయకుండా మిగిలిపోయిన రూ.26వేల కోట్లను చట్ట ప్రకారం క్యారీ ఫార్వర్డ్ చేయాలని కోరుతున్నామ‌న్నారు. ఎస్టీలకు రూ.17,169 కోట్లు కేటాయించినప్పటికీ రూ.3000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు.హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కు రూ.32 కోట్ల బకాయిలు చెల్లించాలి.
ఈ సంవత్సరం ఇప్పటివరకు నోటిఫికేషన్ జారీ చేయలే దు. బెస్ట్అ వలేబుల్ పథకానికి రూ.649 కోట్లు ఫీజు బకాయి చెల్లించాల్సి ఉంది. అంబేద్కర్ విద్యానిధి పథకానికి రూ.1894 కోట్ల నిధులను చెల్లించాల్సింది. వివిధ విద్యా పథకాలతోపాటు విద్యార్థులకు చెల్లించాల్సిన పోస్ట్, ప్రిమెట్రిక్ స్కాలర్షిప్ లను, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో అడుగడుగునా నిర్లక్ష్యంతో విద్యార్థుల పై చదువులకు ఆటంకంగా మారాయ‌న్నారు. మెజారిటీ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల యూనివర్సిటీల బలోపేతానికి బడ్జెట్ లో విద్యారంగానికి కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని కోరారు.  ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం సంవత్సరంలో రెండుసార్లు ముఖ్యమంత్రి అధ్యక్షతన హై పవర్ కమిటీ సమావేశం నిర్వహించి సమీక్ష చేయాల్సి ఉండగా రెండున్నరేళ్లుగా ఒక్క సమావేశం కూడా జరపలేద‌న్నారు.  రాష్ట్రంలో దాదాపు260కి పైగా కుల దురంహంకార హత్యలు జరిగాయి. కులాంతర జంటలకు చెల్లించాల్సిన ఆర్థిక సహాయం అందించడంలో సైతం ప్రభుత్వం నిర్లక్ష్యం ,వివక్షతను ప్రదర్శిస్తున్న‌ది. 445 కోట్లు కులాంతర జంటలకు బకాయిలు ఉన్నాయి. కుల దురంహకార హత్యలు చేసిన నిందితులలో ఎంతమందికి శిక్షలు పడ్డాయో ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. రాజీవ్ యువ కిరణాలు అంటూ ప్రచారం చేసి దరఖాస్తులు స్వీకరించి నేటికి సంవత్సరం దాటుతున్న పథకం అమలు చేయకుండా రాజీవ్ గాంధీని అవమానపరిచారు. ఎస్సీ , ఎస్టిలకు భూ పంపిణీ చేయకపోగా కొద్దిపాటి గా ఉన్న భూములకు రక్షణ లేకుండా పోతున్న‌ది. అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రకారం గిరిజనులకు అందించాల్సిన పట్టాలను అందించడంలో నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తున్న‌ద‌న్నారు. కౌలు రైతులకు రైతు భరోసా అందిస్తామని మాట తప్పారు. సన్న వడ్లకు బోనస్ కౌలు రైతులకు అందించడం లేదు. భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అటకెక్కింది. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నత్తనడక నడుస్తోంది.  అర్హులైన అందరికీ పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ నెరవేర్చలేదు. కొత్త పెన్షన్ల మంజూరు జాడ లేదన్నారు.  కార్యక్రమంలో తెలంగాణ విద్య పరిరక్షణ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ, భీమ్ మిషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్వయ్య, డిబిఎఫ్ వ్యవస్థాపకులు కొరి వినయ్ కుమార్, డిబిఎస్ యు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అమృత నరసింహ, శివలింగం, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, ఓయూ జేఏసీ వ్యవస్థాపకులు మందాల భాస్కర్ , న్యాయవాదులు,రాహుల్ దివాకర్, డి బిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్ల శంకర్, కార్యదర్శి పులి కల్పన, ఎగొండ స్వామి, దుబాసి సంజీవ్, సుంచు రాజేందర్, జేఎంఐ రాష్ట్ర వైస్ చైర్మన్ ఆవుల సుధీర్, జర్నలిస్ట్ లక్ష్మీనారాయణ, సామాజిక కార్యకర్త సజయ, ఓయూ జేఏసీ నాయకులు సైదులు, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వినయ్ , పృధ్వీరాజ్ రంగమ్మ, శారద ఉమా భాగ్య యాదమ్మ, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *