– ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 19: మహిళలకు ఉపాధి అవకాశాలు, వివక్షను రూపుమాపడం, లింగ సమానత్వం సాధించడం, మహిళల భద్రత, ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాలపై నిపుణుల, మేధావుల, అధికారుల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనున్నదని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి, వారి ఆత్మవిశ్వాసం, హక్కుల బలోపేతం కోసం ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశామన్నారు. మహిళల సంక్షేమం, భద్రత విషయంలో ఎన్నో చట్టాలు ఉన్నా సమాజ పోకడల వల్ల కొన్నిసార్లు ఆచరణకు నోచుకోవటం లేదని, మహిళలు తమ హక్కులు తెలుసుకోలేని పరిస్థితి ఎదురవుతోందని, పని ప్రదేశాల్లో ఎదురయ్యే సమస్యలను చెప్పుకోలేని పరిస్థితినీ ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాజకీయపరమైన సదస్సు కాదంటూ మహిళలకు విద్య, ఉపాధి ఉద్యోగ, భద్రత విషయాల్లో ఎలాంటి అవసరాలు కల్పించాలన్న అంశాలపై ఇక్కడ చర్చించి నివేదిక రూపొందించాలని కోరారు. మహిళా విధానం ఎలా ఉంటే బాగుంటుంది అనే అంశంపై రౌండ్ టేబుల్ కన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు. సలహాలు, సూచనలు తెలుసుకుని త్వరలో భారీ సదస్సును నిర్వహిస్తామన్నారు. చిన్నారులు పిల్లలు మహిళలు ఉపాధి విద్య అంశాల్లో ప్రభుత్వం ఇంకా ఏమి చేయాల్సి ఉందో తెలుసుకుంటామన్నారు. ఎన్నో ఆటంకాలను అధిగమించి దేశ ప్రధానిగా ఈ దేశ అభివృద్ధిలో ముద్ర వేసిన ఇందిరా గాంధీ మహిళలందరికీ స్ఫూర్తిదాయకమంటూ ఆమె జయంతి సందర్భంగా మహిళలు ఆత్మగౌరవంతో ఎదగాలని పిలుపునిచ్చారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళల ఆర్థిక, సాధికారత కోసం పనిచేస్తున్నామని మంత్రి సీతక్క చెప్పారు. మహిళల సాధికారత దిశలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మార్గదర్శనం చేయాలంటూ ప్రభుత్వాలు చట్టాలు, విధానాలు తీసుకొచ్చేందుకు మీరిచ్చే సూచనలు, సలహాలు ఉపయోగపడతాయన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక చర్చ మాత్రమే కాదు.. భవిష్యత్తు మహిళా విధానానికి పునాది వేసే చారిత్రక ఘట్టం.. ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజు అని అన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యార్, సీనియర్ ఐఏఎస్ సీతాలక్ష్మి, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, అనిత రామచంద్రన్, జి సృజన, పలువురు మహిళా ఐపీఎస్‌లు, బాలల హక్కుల కమిషన్ సభ్యులు, మేధావులు, నిపుణులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





