యూరియా స‌ర‌ఫ‌రాలో కేంద్రం వివ‌క్ష‌

– రైతుల‌తో క్రూర‌మైన ఆట ఆడుతున్న కేంద్రం
– లేఖ‌ల‌పై త‌ప్ప ఆచ‌ర‌ణ‌లో ఏమీ లేదు
– మంత్రులు క‌లిసినా క‌ద‌లిక లేదు
– కేంద్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ తుమ్మ‌ల

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 13: రాష్ట్రానికి అవసరమైన యూరియా ఎరువుల సరఫరాలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం, ద్వంద్వ వైఖరిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. రైతులతో, వ్యవసాయంతో కేంద్రం క్రూరమైన ఆటలాడుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రం తరఫున  ఎన్ని లేఖలు రాసిన కూడా, రాష్ట్రానికి మేమున్నాము, మేము చూసుకుంటామని లేఖల్లో తెలపడం తప్ప, రాష్ట్రానికి కేంద్రం చేసింది ఏమీ లేదని మంత్రి  విమర్శించారు. కేంద్రం రాష్ట్రం మీద సవతి తల్లి ప్రేమను చూపిస్తున్న‌దని ఆరోపించారు. రాష్ట్ర రైతులకు ప్రయోజనం చేకూరేందుకు రాజకీయాలన్నింటిని పక్కన పెట్టి, ఎన్నోసార్లు కేంద్రం తలపు తట్టామని, రాష్ట్ర మంత్రిగా నేనే కాకుండా, స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్వయంగా కలిసి లేఖల ద్వారా పలుమార్లు కోరినా కూడా కేంద్రం రాష్ఠ్రంపై శీతకన్ను చూస్తుందని దుయ్యబట్టారు. మా అధికారులు కూడా నెలకు ఒకసారి కేంద్ర అధికారులను కలిసి విన్నవించిన కూడా ఎలాంటి కదలిక లేదని అన్నారు. కనీసం రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులను కోరినా ఫలితం ఉంటుందేమో అనుకుంటే వారు కూడా రాజకీయ ప్రకటనలు చేయడం తప్ప రాష్ట్ర రైతాంగం తరపున కేంద్రంతో మాట్లాడింది లేదు. విన్నవించింది లేదన్నారు. రైతన్నల పట్ల ఇలాంటి కఠిన దోరణి మంచిది కాదని, వెంటనే యూరియా సరఫరా చేయాలని అన్నారు. రైతులు ఆగస్టులో వ్యవసాయ పనులు చూసుకుంటూ పొలాళ్లో ఉండాలి కాని ఇలా యూరియా కోసం లైన్లో కాదని, అందుకు కారణమైన కేంద్రంతో ఎంతవరకైనా పోరాడుతామని అన్నారు. మా ఎంపీలు ఈ రోజు కూడా పార్లమెంట్ లో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియా సరఫరా చేయాల్సిందిగా కోరార‌ని తెలిపారు. ఈ ఖరీఫ్‌లో తెలంగాణకు 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినా ఏప్రిల్‌ నుండి జూలై వరకు 32% కొరత ఏర్పడిందని మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. మే నెలలో 45% వరకు లోటు రావడం, ఆగస్టులోనూ 35% కొరత కొనసాగడం కేంద్రం రైతుల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్నారు.  రాష్ట్రంలో రోజుకు 10,000–12,000 మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరుగుతుంటే ఆగస్టులో అవసరం 3 లక్షల మెట్రిక్ టన్నులు అని ముందుగానే రాష్ట్రం స్పష్టంగా తెలియజేసినా కేంద్రం మాత్రం ఎప్పటి మాదిరిగానే మేమున్నాము, చూసుకుంటామ‌ని చెప్పి రిక్త హస్తాన్ని చూపింద‌న్నారు.  దేశీయంగా వుత్పత్తి అయ్యే యూరియానే ఇవ్వమని ఎన్నిసార్లు కోరినా కేంద్రం 39,000 మెట్రిక్ టన్నుల దిగుమతి యూరియాను కేటాయించి దానికోసం నౌకను ఇప్పటివరకు కేటాయించకపోవడం రైతుల పట్ల మోసం కాదా అని ప్రశ్నించారు. ఏప్రిల్‌–జూలైల్లో ఏర్పడిన 2.10 లక్షల మెట్రిక్ టన్నుల కొరతతో పాటు ప్రస్తుత నెలలో ఉన్న 0.57 లక్షల మెట్రిక్ టన్నుల లోటును తక్షణమే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *