తెలంగాణపై కేంద్రం వివక్ష

– ‘సెమీ కండక్టర్‌’ కేటాయించకపోవడం అన్యాయమే
– అన్ని అర్హతలున్నా విస్మరించారు
– పున:పరిశీలించాలని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌ గా నిలుస్తున్న తెలంగాణకు రాజకీయ అక్కసుతోనే కేంద్రం అన్యాయం చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్‌ ప్రాజెక్టు కేటాయింపులో రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమను చూపిస్తోందంటూ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో మండిపడ్డారు. ప్రపంచస్థాయి అధునాతన సిస్టమ్‌ అండ్‌ ప్యాకేజింగ్‌ ఫెసిలిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, మహేశ్వరంలో పదెకరాల భూమి కేటాయించామని, అన్ని రకాల సబ్సిడీలకు ఆమోదం తెలిపామని, రికార్డు సమయంలో అన్ని అనుమతులిచ్చామని తెలిపారు. ఇండియా సెమీ కండక్టర్‌ మిషన్‌ తుది ఆమోదం లభిస్తే పనులు మొదలు పట్టేందుకు ఇన్వెస్టర్‌ సిద్ధంగా ఉన్నారని, అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు.

కనీస సంసిద్ధత లేని ఏపీకెలా కేటాయిస్తారు

అన్ని రకాలుగా అర్హతలున్నా తెలంగాణను విస్మరించి కనీస సంసిద్ధత లేని ఏపీకి ప్రాజెక్టును ఎలా కేటాయిస్తారని మంత్రి శ్రీధర్‌బాబు కేంద్రాన్ని ప్రశ్నించారు. తర్కానికి అందని, న్యాయ విరుద్ధమైన ఈ నిర్ణయం పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలను పంపే ప్రమాదముందన్నారు. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత నిర్ణయాలు దేశ పారిశ్రామికాభివృద్ధికి మంచిది కాదన్నారు. అందుకే ఈ నిర్ణయాన్ని పున:పరిశీలించాల్సిన అవసరముందని, వాస్తవ పరిస్థితులను పరిగణనలోనికి తీసుకుని తెలంగాణకు మేలు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి అని డిమాండ్‌ చేశారు.

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చొరవ తీసుకోవాలి

‘కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి జోక్యం చేసుకుని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని, న్యాయం జరిగేలా చొరవ చూపాలని శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన తెలంగాణ బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారన్నారు. ఇప్పటికీ స్పందించకపోతే రాష్ట్ర ప్రజలు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారు అని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *