షాంఘై నగరం

” చైనాలో షాంఘై జనాభాపరంగా అతి పెద్దనగరం. ఇరవైయైదు మిలియన్ల జనాభా.. ప్రపంచంలోని అతిపెద్ద మెట్రో పాలిటన్ నగరాలలో ఒకటి. ప్రాథమిక విద్య ఉచితం. పిల్లలు లేక ఎనిమిది వేల పాఠశాలలు మూతబడ్డాయట. షాంఘైలో ఇరవై శాతం భారతీయులు ఉన్నారట. షాంఘై పాతనగరం, కొత్త నగరమని రెండు భాగాలుగా ఉంది.1990 నుంచి కొత్తనగరం వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నదట.”

గిరియానం -10

చైనా పర్యటనలో భాగంగా ఎనిమిదో రోజున మేం బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసి ఎనిమిదిన్నరకు గుయిలిన్ ఎయిర్ పోర్ట్ కు  చేరుకున్నాం. షాంఘైకి మా ఫ్లైట్ పదకొండుగంటలకుంది. మధ్యాహ్నం ఒంటిగంట ముప్ఫైయైదు నిమిషాలకు షాంఘై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాం. లగేజీతో బయటకు వచ్చేసరికి మహిళా గైడ్ సిద్ధంగా ఉంది . ఆమె పేరు ఐసెస్. చాలా ఉత్సాహంగా వుంది. ఇరవైయేళ్ళ అనుభవం ఉందని చెప్పింది. మేం సరాసరి నగర పర్యటనకు బయలుదేరాం.

చైనాలో షాంఘై జనాభాపరంగా అతి పెద్దనగరం. ఇరవైయైదు మిలియన్ల జనాభా .. ప్రపంచంలోని అతిపెద్ద మెట్రో పాలిటన్ నగరాలలో ఒకటి. ప్రాథమిక విద్య ఉచితం. పిల్లలు లేక ఎనిమిది వేల పాఠశాలలు మూతబడ్డాయట. షాంఘైలో ఇరవై శాతం భారతీయులు ఉన్నారట. షాంఘై పాతనగరం, కొత్త నగరమని రెండు భాగాలుగా ఉంది.1990 నుంచి కొత్తనగరం వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నదట. చైనా వృద్ధుల సంఖ్య ఎక్కువై యువ జనాభా తగ్గడం వల్ల భవిష్యత్తు దృష్ట్యా ఇపుడు పిల్లలను కనడం కొరకు ప్రభుత్వం చాలా రాయితీలు ప్రకటించిదట. ఇద్దరు పిల్లలను కంటే ఒకరి పెంపకం బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటుందని గైడ్ చెప్పింది. అలా నగర పర్యటన చేస్తూ  జెన్ మావో టవర్ కు వెళ్ళాం.

జెన్ మావో టవర్ షాంఘైలో ఉన్న ఎత్తైన భవనం. దానిని గోల్డెన్ ప్రాస్పెరిటీ బిల్డింగ్ అని కూడా పిలుస్తారు. ఆ భవనంలో పద్ధెనిమిది అంతస్తులు ఉన్నాయి. ఎత్తు నాలుగు వందల ఇరవైన్నర మీటర్లు. ఒక వెయ్యి మూడువందల ఎనభై అడుగులు. అక్కడున్న లిఫ్ట్ నిముషానికి తొమ్మిది మీటర్ల వేగంతో పైకి వెళుతుంది. మేం ఎనభై ఎనిమిదవ అంతస్తు లోకి అతి తొందరగా వెళ్ళి పోయాం. అక్కడ గ్లాస్ స్కై వాక్ ఉంది. అక్కడి నుంచి చూసినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలు చాలా అందంగా కనిపించాయి. దాని నిర్మాణం 1994 లో మొదలుపెట్టి 1999లో ముగించారట. ఆ భవనంలో ఐదు నక్షత్రాల హోటళ్ళు, షాపింగ్ మాల్స్ మొదలైనవి ఉన్నాయి. పైనుంచి కిందకు చూసినప్పుడు ఆ నిలువు ప్రాకారం (attrium) అద్భుతంగా కనిపించింది.

సాయంత్రం హువాంగ్ పు నదిలో క్రూయిజ్ ట్రిప్ .. ప్రవేశ రుసుం నూట ఇరవై యువాన్లు. ఆదివారం కావడం వల్ల గంటన్నర ప్రయాణం. మిగతా రోజుల్లో గంట మాత్రమే ఉంటుందట. అందుకని మా టూర్ ఆర్గనైజర్ శనివారం ఉన్న  ప్రోగ్రాంను ఆదివారానికి మార్చారు. అందువల్ల మేం అరగంట ఎక్కువ క్రూయిజ్ ట్రిప్ ను ఎంజాయ్ చేశాం. నేనూ మరో నలుగురం క్రూయిజ్ టెర్రస్ పైకి వెళ్ళాం. దాని వల్ల షాంఘైలోని స్కైలైన్ ను దగ్గరగా చూసే అవకాశం దొరికింది. ఈ ట్రిప్ మేం రాత్రి సమ యంలో చేయడం వల్ల విద్యుద్దీపాల కాంతిలో షాంఘై నగరంలో ప్రధాన భవనాలు మెరిసిపోయాయి. మేం మధ్యాహ్నం బస్ లో నుంచి చూసిన ఓరియంటల్ పెర్ల్ టీవి టవర్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లను పోల్చు కొన్నాం. విభిన్న లైట్ల కాంతిలో టీవీ టవర్ చాలా అందంగా ఉంది.

షాంఘైలో ఉన్న  ఓరియంటల్ పెర్ల్ టీవీ టవర్ నగరంలో ఎత్తైన భవనాలలో రెండో టీవీ టవర్. ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న ఎత్తైన టీవీ టవర్. దాని నిర్మాణం మధ్యలో రెండు గోళాలతో సన్నగా పొడుగ్గా అందంగా ఉంది . నాలుగు వందల అరవై ఎనిమిది మీటర్ల ఎత్తు. దాని నిర్మాణం 1991లో మొదలై 1994 పూర్తయింది. బహుళ అంతస్తుల భవనం కావడం వల్ల అందులోనూ హోటల్స్, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. షాంఘైనగరంలోనే పెద్దదైన షాంఘై టవర్ లో 128 అంతస్తులున్నాయి. ఎత్తు ఆరువందల ముప్ఫై రెండు మీటర్లు. రెండు వేల డెబ్బై మూడు అడుగులు. ప్రపంచంలోనే ఎత్తైన మూడో భవనం. దాని నిర్మాణం 2016 లో పూర్తయింది.

101 అంతస్తుల మరో ఎత్తైన భవనం షాంఘై వరల్డ్ ఫైనాన్షియల్ సెంటర్. సెంటర్ పదం ఒకే భవనానికి వర్తించదు. అయినా ఆ భవనం అక్కడ ఆ పేరుతోనే ప్రచారంలో వుంది. నేను పేర్కొన నాలుగు ఆకాశ హర్మ్యాలు పుడాంగ్, లుజియాజుయ్ రోడ్డులోనే వున్నాయి. కాబట్టి ఒక టవర్ పైకి ఎక్కితే మిగతావి కనబడతాయి. అందుకని మేం జెన్ మావో టవర్ మాత్రమే ఎక్కాం. మిగతావి రోడ్డు బయటనుంచే చూసాం. ఇవన్నీ 1990 తర్వాతనే నిర్మించబడ్డాయి. వాటిని చూసినప్పుడు గైడ్ చెప్పి నట్లుగా 1990 నుంచి షాంఘైనగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో చెప్పడానికి అవి సాక్ష్యాలుగా కనిపించాయి. అదంతా కొత్త షాంఘైనగరం.

తెల్లవారి ఉదయం  పాత షాంఘై నగరంలో వున్న జేడ్ బుద్ధుని ఆలయానికి వెళ్ళాం. దానికి మరొక పేరు యుఫో ఆలయం. అది 1882 నాటి ఆలయం. యుద్ధకాలంలో ధ్వంసం కాకుండా కాపాడుకున్నారట. ఆ ప్రాంగణంలో బంగారం, మార్బుల్ బుద్ధుని విగ్రహాలున్న చిన్నచిన్న గుళ్ళు కూడా వున్నాయి. జేడ్ బుద్ధుని విగ్రహాలను బర్మానుంచి తెప్పించారని గైడ్ చెప్పింది. అందులో ఒకటి ఆకుపచ్చ జేడ్ తో చేసిన విగ్రహం. అది బుద్దుడు కూర్చున్నట్లుగా ఉంది. దాని ఎత్తు రెండు మీటర్లు. బుద్ధునికి ఇరువైపులా చాలా మంది స్త్రీ పురుషులు కూర్చుని జాతక కథలు రాస్తున్నారు. ప్రవేశ రుసుం పది యువాన్లు. ఫోటోగ్రఫీ నిషిద్ధం. మరో విగ్రహం తెలుపు రంగు జేడ్ తో చెక్కబడి పడుకున్నట్లుగా ఉంది . అది బుద్ధుని నిర్యాణాన్ని సూచిస్తుంది. అక్కడ కూడా జాతక కథలు రాస్తూ చాలా మంది చైనీయులు కనిపించారు. అక్కడ చాలా పెద్ద బౌద్ధ గ్రంథాల సేకరణ ఉంది .

 యుయాన్ గార్డెన్ కు వెళ్ళాం. ఇది మింగ్ రాజుల కాలం నాటిది. నాలుగువందల యేళ్ళ చరిత్ర ఉన్న తోట చైనాలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. పాన్ యుండువాన్ అనే అధికారి తన తండ్రి కోసం నిర్మించాడని గైడ్ చెప్పింది. అది యుయువాన్ అనే వీధిలో ఉండడం వల్ల దానికాపేరు వచ్చింది. మేం అక్టోబర్ లో వెళ్ళడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. చిన్న సరస్సులు, శిల్పాలు, వివిధరకాల మొక్కలతో చాలా అందంగా వుంది. దాని చుట్టుపక్కల మంచి వాణిజ్య సెంటర్ ఉంది. అక్కడి నుంచి మేం చైనా సంప్రదాయ కళ ఐన ఎరా అక్రోబాటిక్  ప్రదర్శనకు వెళ్ళాం. ప్రవేశ రుసుం వంద యువాన్ లు.

అక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు చేసిన విన్యాసాలు అత్యద్భుతంగా ఉన్నాయి. అక్కడ వాడిన సాంకేతిక జ్ఞానం అదరహో! అనిపించింది. భూమిలోనుంచి వేదికలు పైకి రావడం, బాత్ టబ్ లు అక్కడిక్కడే ఉద్భవించడం లాంటివి కొన్ని ఉదాహరణలు. అది చాలా అడ్వాన్స్ డ్ సర్కస్ లాగా అనిపించింది. హైదరాబాదు నుమాయిష్ లో జాలి గోళం లోపల ఒక బైక్ గిరగిరా తిప్పడం చూసాను. కానీ అక్కడ అంతే పరిమాణంలో ఉన్న  గోళం లోపల ఒకరి తర్వాత ఒకరు పన్నెండు బైకులు తిప్పడం ఆశ్చర్యపరిచింది. గంటన్నర సాగిన ప్రదర్శన అప్పుడే అయిపోయిందా! అనిపించింది. తర్వాత డిన్నర్ చేసి రూం కు వెళ్ళిపోయాం. తెల్లవారితే ఇండియాకు ప్రయాణం.

 గైడ్ ఐసెస్ వ్యక్తిగత పని ఉందని వెళ్ళిపోవడం వల్ల ఆరోజు లిండా గైడ్ గా వచ్చింది. బ్రేక్ ఫాస్ట్ చేసి ఎయిర్ పోర్టుకు బయలుదేరాలి. మేం చెకిన్ చేసే వరకూ లిండా మాతోనే ఉంది . టూర్ ఆర్గనైజర్ శ్రీదేవి అందరి లగేజీని బస్ లో ఎయిర్ పోర్టుకు తీసుక వచ్చింది. మేమందరం లిండా పర్యవేక్షణలో మాగ్నెటిక్ ట్రైన్ లో ఎయిర్ పోర్టుకు వెళ్ళాం. మాగ్నెటిక్ ట్రైన్ ఎక్కిన అనుభవం కొరకు శ్రీదేవి ఆ ఏర్పాటు చేసింది. లిండా భారత దేశపు జాతీయ జెండాతో వచ్చి, మన దేశం పట్ల తనకున్న అభిమానాన్ని తెలియజేసింది. ఆమెకు ఒక పాప. పేరు చాప్లిన్. మూడోతరగతి చదువుతుందట. మా హోటల్ నుంచి ఎయిర్ పోర్టుకు దాదాపు బస్ లో గంట సమయం. నలభై కిలోమీటర్ల దూరం మేం మాగ్నెటిక్ ట్రైన్ లో ఎనిమిది నిమిషాలలో చేరుకున్నాం. దానిని బట్టి మాగ్నెటిక్ ట్రైన్ వేగాన్ని అంచనా వేయొచ్చు. రైల్వే స్టేషన్ ఎయిర్ పోర్టుకు ఏ మాత్రం తీసిపోదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *