అంతర్జాతీయ ప్రమాణాలతో విపత్తుల శిక్షణ కేంద్రం

– ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌న్న‌ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శిక్షణ కేంద్రం (ఎస్‌ఐడీఎం) ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సంబంధిత విభాగాల నుంచి ఉన్నతస్ధాయి కమిటీని ఏర్పాటు చేసుకుని కార్యాచరణ రూపొందించాలన్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో విపత్తుల నిర్వహణల్ణ విభాగం, ఫైర్ సర్వీసెస్, ఎస్‌డిఆర్‌ఎఫ్, హైడ్రా, ఐసిసిసి విభాగాలతో మంత్రి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలకు విపత్తు నిర్వహణపై ఒకే విధమైన శిక్షణను అందించడం, శాస్త్రీయ పద్ధతుల ద్వారా ప్రాణ, ఆర్థిక నష్టాలను కనిష్థ స్థాయికి తగ్గించడం, క్షేత్రస్థాయిలో ముఖ్యంగా జిల్లాల్లో విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించడం, విపత్తుల నివారణకు సంబంధించి ఇది ఒక అత్యున్నత పరిశోధన, పాలసీ సపోర్టు కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ విపత్తులు సంభవించినప్పుడు కేవలం సహాయక చర్యలకే పరిమితం కాకుండా ముందస్తు సన్నద్ధతతో నష్టాన్ని తగ్గించే లక్ష్యంతో స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. విపత్తుల నిర్వహణలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేలా అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. వరదలు, అగ్నిప్రమాదాలు వంటి అత్యవసర పరిస్ధితుల్లో త్వరితగతిన స్పందించడానికి కచ్చితమైన సమాచార వ్యవస్ధ, రియల్ టైమ్ మానిటరింగ్, సాధ్యమయ్యేలా విపత్తు ముందస్తు హెచ్చరిక వ్యవస్దలు, డ్రోన్‌లు, హైస్పీడ్ బోట్లు వంటివాటిని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి దానకిశోర్, అగ్పిమాపక శాఖ డైరెక్టర్ విక్రమాన్ సింగ్, హైడ్రా కమిషనర్ రంగనాధ్, ఐసిసిసి డైరెక్టర్ కమల్‌హాసన్‌రెడ్డి, స్పెషల్ పోలీస్ బెటాలియన్ అడిషనల్ డిజీ సంజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *