– పల్లెలకు అవార్డులు, అభివృద్ధి బంద్
– డబ్బుసంచులు కుమ్మరిస్తున్న కాంగ్రెస్
– త్వరలో వన్ నేషన్ వన్ ఎలక్షన్
– మళ్లీ కేసీఆర్ రావడం ఖాయం
– బీఆర్ ఎస్ నేత హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయని, ప్రజల తీర్పు చూసి కాంగ్రెస్ నాయకులకు షాక్ తగిలిందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం మల్కాపూర్, కోనైపల్లి, నర్సంపల్లి గ్రామాల్లో గెలిచిన సర్పంచులు, అలాగే అచ్చంపేట నియోజకవర్గం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత మండలం వంగూరులో 10 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచ్‌లు బుధవారం హైదరాబాద్ లో హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి సొంత గడ్డపై కాంగ్రెస్ ప్రలోభాలను తట్టుకొని నిలబడిన వంగూరు సర్పంచ్‌లను, గజ్వేల్ సర్పంచులను అభినందించి, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి దఫా ఫలితాలు చూసి షాక్ అయ్యారు.. రెండో దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక మూడో దశ ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీనీ నిరాశపరచక తప్పదన్నారు. ఈ ఓటమి భయంతోనే ఇప్పుడు డబ్బు సంచులు పట్టుకొని హైదరాబాద్ నుండి బయలుదేరారు. పోలీసులను అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్నా యకత్వంలో తూప్రాన్ మండలమే కాదు రాష్ట్రం మొత్తం అద్భుతంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు. నాడు దిల్లీలో అవార్డులు ఇస్తే తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా జాబితా ఉండేది కాదు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో తెలంగాణకు ఒక్క అవార్డు కూడా రాలేదన్నారు. పల్లెలు అపరిశుభ్రంగా మారాయి. కనీసం కేసీఆర్ కొనిచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు.
ఆనాడు కేసీఆర్ గారు ప్రతి నెలా పల్లెలకు నిధులు విడుదల చేసేవారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు బంద్ అయ్యాయి. పల్లె ప్రకృతి వనాలు, డంపు యార్డ్లు అన్నీ మూలకు పడ్డాయి. అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కాబట్టే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్ నాయకులను నేను హెచ్చరిస్తున్నా.. మా కార్యకర్తల జోలికి వ సహించేది లేదన్నారు. దాడులు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. బీఆర్ఎస్ లో గెలిచిన వారిని బలవంతంగా పార్టీలో చేర్చుకోవాలని చూసినా కుదరదు.. ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులని గుర్తుంచుకోండి. వారు మీ బెదిరింపులకు లొంగరన్నారు.
దేశం వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా వెళ్తోంది. బహుశా మరో ఆరు నెలల్లోనో ఏడాదిలోనో ఎన్నికలు రావచ్చు. రెండేళ్లలో కచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. గెలిచిన సర్పంచ్‌లంతా ధైర్యంగా ఉండండి. మళ్ళీ గ్రామాలకు మంచి రోజులు వస్తాయి. అభివృద్ధి పథంలో మన గ్రామాలన్నీ పయనిస్తాయని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





