దివ్యాంగుల‌కు గౌర‌వ‌ప్ర‌ద‌మైన జీవిత‌మే ల‌క్ష్యం

– వీరు కేవ‌లం స‌హాయం పొందే వ‌ర్గం కాదు
– ఆత్మ‌విశ్వాసంతో జీవించ‌గ‌ల‌రు
– వీరి కోసం ప్ర‌త్యేక ప‌థ‌కాలు
– మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్‌
హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 18: సంక్షేమంతోపాటు దివ్యాంగులు స్వతంత్రంగా, గౌరవప్రదమైన జీవనం సాగించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సాంఘిక సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్‌లోని ఏలియ‌న్ ఇన్నోవేష‌న్స్ కార్యాలయంలో దివ్యాంగుల కోసం గురువారం నిర్వహించిన అసిస్టివ్ టెక్నాలజీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజర‌య్యారు. దివ్యాంగులు కేవలం సహాయం పొందే వర్గం కాదని, అవకాశం ఇస్తే తమ కాళ్లపై తామే నిలబడి ఆత్మవిశ్వాసంతో జీవించగల సామర్థ్యం ఉన్న పౌరులని మంత్రి పేర్కొన్నారు. ఇదే ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  స్పష్టమైన దృక్పథమని తెలిపారు. అందుకే రాష్ట్ర‌ ప్రభుత్వం పింఛన్లకే పరిమితం కాకుండా విద్య, ఉపాధి, ఉద్యోగ రిజర్వేషన్, టెక్నాలజీ, స్వయం ఉపాధి అన్నీ కలిసేలా సమగ్ర విధానంతో పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. సకాలంలో, ఎలాంటి అడ్డంకులు లేకుండా పేద దివ్యాంగుడి చేతికి పింఛన్లు చేరేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే దివ్యాంగ విద్యార్థి ఎక్కడా ఆగిపోకుండా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు ఉన్న రిజర్వేషన్ కాగితాల్లోనే కాకుండా వాస్తవంగా ఉద్యోగాల్లో కనిపించాలన్నదే సీఎం స్పష్టమైన ఆదేశమని గుర్తు చేశారు. ఈ లక్ష్య సాధనలో టెక్నాలజీ ఆధారిత ఇన్నోవేషన్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (టీజీఐసీ) అనేకమంది యువ ఆవిష్కర్తలకు మార్గదర్శకత్వం చేస్తూ వారి ఆలోచనలను స్టార్టప్‌లుగా మార్చడంలో ముందుండి పనిచేస్తోందని మంత్రి ప్రశంసించారు. టీజీఐసీ మద్దతుతో ఎదిగిన ఏలియ‌న్ ఇన్నోవేష‌న్స్ వంటి సంస్థలు దివ్యాంగుల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చే ఉత్పత్తులను రూపొందించడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలియ‌న్ ఇన్నోవేష‌న్స్ రూపొందించిన న‌వినాల్ట్ అసిస్టివ్ టెక్ పరికరాలను 20 మందికి పైగా దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు మంత్రి అడ్లూరి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఉద్యోగాలు చేస్తున్న దివ్యాంగులు ఎవరి మీద ఆధారపడకుండా తమ వృత్తి గౌరవాన్ని కాపాడుకునేలా ఈ టెక్నాలజీలు రూపుదిద్దుకున్నాయని తెలిపారు. ఇది కేవలం వ్యాపారం కాదని, సామాజిక బాధ్యతతో కూడిన ఇన్నోవేషన్ అని పేర్కొన్నారు. బోస్చ్ వంటి సంస్థలు ముందుకు వచ్చినట్లే మరిన్ని కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్‌ ద్వారా దివ్యాంగుల సాధికారతకు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. సీఎస్ఆర్‌ ద్వారా వచ్చే నిధులు దివ్యాంగుల సంక్షేమానికి మాత్రమే కాక వారి స్వయం ఆధారిత జీవనంలో పెట్టుబడిగా మారాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రభుత్వ–సీఎస్ ఆర్‌–స్టార్టప్ భాగస్వామ్యంతో దివ్యాంగుల కోసం ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని దేశంలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించడం దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని చెప్పారు. కేవలం 21 ఏళ్ల వయసులోనే ఏలియ‌న్ ఇన్నోవేష‌న్స్ వ్యవస్థాపకుడు రవి కిరణ్ ప్రపంచ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన గ్లోబ‌ల్ ఇమాజిన్ వెంచ‌ర్ విన్న‌ర్ అవార్డు సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందడం ప్రతి తెలంగాణ వాసికి గర్వకారణమని మంత్రి తెలిపారు. టీజీఐసీ మద్దతుతో ఎదిగిన ఇన్నోవేటర్‌గా రవి దృష్టిలోపం ఉన్నవారికి మరిన్ని అవకాశాలు కల్పిస్తూ, తెలంగాణను మరింత అందుబాటులో ఉండే రాష్ట్రంగా మార్చాలన్న స్పష్టమైన విజన్‌తో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీజీఐసీ సీఈఓ మిరాజ్, యునిసెఫ్ (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ) ఫీల్డ్ ఆఫీసర్ జెలామియాలి, ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధి ప్రదీప్‌తోపాటు నెట్‌వర్క్ మోడల్‌పై పనిచేస్తున్న పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *