– దేశంలో 75% మహిళల వద్దనే మొబైల్ ఫోన్లు
– పురుషులతో పోలిస్తే స్మార్ట్ ఫోన్ వినియోగంలో 13% తక్కువ
– మహిళల అభివృద్ధికి ఆటంకిగా వెనుకబాటుతనం
– వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
పనాజి, సెప్టెంబర్ 6: చిన్న ,మధ్యతరగతి ఆదాయం కలిగిన దేశాల్లో మహిళలు పురుషుల కంటే 8% తక్కువగా మొబైల్ ఫోన్లు కలిగి ఉన్నారని, స్మార్ట్ ఫోన్ వినియోగంలో 13% తేడా వున్నదని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. గోవాలో ఫ్రిడ్రిక్ ఎబర్ట్ స్టిఫ్టుంజ్ ఇండియా సంస్థ శనివారం నిర్వహించిన సెమినార్‌లో ఆమె ప్రసంగించారు. 405 మిలియన్ల మంది మహిళలు ఇంకా డిజిటల్ ప్రపంచానికి చేరుకోలేదని, ఇది మహిళల అభివృద్ధికి పెద్ద ఆటంకంగా మారిందని అన్నారు. దేశంలో 75% మహిళలు మాత్రమే మొబైల్ ఫోన్ కలిగి ఉండగా, స్మార్ట్ ఫోన్ వినియోగం 35% మాత్రమే ఉందన్నారు. ఈ అంతరంవల్ల మహిళల ఆర్థిక స్వావలంబన, విద్య, ఆరోగ్య సేవలు పొందడంలో సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు. పూర్వకాలంలో మహిళల శక్తికి ప్రతీకగా వరంగల్ ప్రాంతంలోని చారిత్రక ఘటనలను వివరించారు. కాకతీయ రాణీ రుద్రమదేవి నాయకత్వం, సమ్మక్క-సారలమ్మ పూజలు వంటి చారిత్రక అంశాలతో మహిళల శక్తిని వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం, వడ్డీ రహిత రుణాలు, మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాల విడుదల, ఆరోగ్యసేవలకు రు.10 లక్షల వరకూ సౌకర్యం, రు.2,500 నెలకు ఆర్థిక సహాయం వంటి సమర్థమైన పథకాలు అమలు అవుతున్నట్లు వివరించారు. డిజిటల్ యుగంలో మహిళల అసమానతలు తగ్గించేందుకు తక్కువ ధరకే మొబైల్ పరికరాలు అందించడం, డిజిటల్ విద్య, మౌలిక సదుపాయాలు పెంపొందించడం అత్యవసరమన్నారు. ఈ దిశగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధి కోసం గణనీయమైన కృషి చేస్తున్నదన్నారు. సదస్సులో తమిళనాడు ఎంపీ ఆర్.సుధ, ఎమ్మెల్యే పర్ణికా రెడ్డితోబాటు పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





