‘డిజిటల్ సేఫ్టీ’లో రోల్ మోడల్ గా రాష్ట్రం

– విజన్ 2047 డాక్యుమెంట్ష‌లో స‌మ‌గ్ర రోడ్ మ్యాప్‌
– సైబ‌ర్ మోసాలు అరిక‌ట్టాలంటే పౌరుల స‌హ‌కారం అవ‌స‌రం
 ‘ఎస్ సీ ఎస్ సీ కాంక్లేవ్ 2025’ లో మంత్రి దుద్దిళ్ల 

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 11: తెలంగాణను డిజిటల్ సేఫ్టీలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అందుకనుగుణంగానే తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 డాక్యుమెంట్ లోనూ కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ ను పొందుపర్చామన్నారు. హెచ్ఐసీసీ లో గురువారం నిర్వహించిన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్ సీ ఎస్ సీ) కాంక్లేవ్ 2025ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌మాట్లాడుతూ రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతూ సైబర్ నేరగాళ్లు సవాలు విసురుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 265 మిలియన్లకు పైగా సైబర్ దాడులు జరిగాయన్నారు. కీలక రంగాలకు చెందిన సంస్థలు, కంపెనీలపై గతేడాది 17వేలకు పైగా రాన్సమ్ వేర్ దాడులు జరిగినట్లు ఓ ప్రముఖ సెక్యూరిటీ సంస్థ అధ్యయనంలో తేలిందన్నారు. ఒక్క సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఏడాది వ్యవధిలో రూ.800 కోట్లకు పైగా సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టడం వాస్తవ పరిస్థితికి నిదర్శనమన్నారు. ఇలాంటి తరుణంలో సంప్రదాయ పోలీసింగ్ కాకుండా స్మార్ట్ పోలీసింగ్ అవసరమని గుర్తు చేశారు. పౌరుల భాగస్వామ్యంతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని వివరించారు. మోసం జరిగిన తర్వాత కాకుండా ముందే స్పందించి సైబర్ నేరగాళ్లను కట్టడి చేసి వ్యవస్థ అవసరమన్నారు. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ డేటా సిస్టమ్స్, రియల్ టైం మానిటరింగ్, ఓపెన్ ఇన్ఫర్మేషన్ లాంటి అధునాతన వ్యవస్థల ద్వారా తమ ప్రభుత్వం పౌరుల డిజిటల్ సేఫ్టీకి చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ వారిని వారియర్స్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ యూఎస్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ లారా విలియమ్స్‌, ఏడీజీపీ చారుసిన్హా, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఎస్ సీ ఎస్ సీ సెక్రెటరీ జనరల్ రమేష్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *